బీరుట్ పేలుళ్లకు కారణాన్ని వెల్లడించిన లెబనాన్ అధికారులు

  • IndiaGlitz, [Wednesday,August 05 2020]

లెబనాన్ రాజధాని బీరుట్‌లో పేలుళ్లకు కారణాన్ని లెబనాన్ అధికారులు కనుక్కున్నారు. బీరుట్‌ను వణికించిన పేలుళ్లకు అమ్మోనియం నైట్రరేట్ కారణమని అధికారులు ప్రకటించారు. బీరుట్ పోర్టుకు సమీపంలోని ఓ గోదాములో నిల్వ ఉంచిన 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ కారణంగా ఈ పేలుళ్లు సంభవించిన అధికారులు వెల్లడించారు. దీనిపై లెబనాని ప్రధాని హసాన్ దియాబ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద మొత్తంలో రసాయనాలను నిల్వ ఉంచడం బాధ్యతా రాహిత్యమన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని.. కారకులెవరైనా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

కాగా.. బీరుట్‌‌లో మంగళవారం సంభవించిన పేలుళ్లు అక్కడి ప్రజల వెన్నులో వణకు పుట్టించాయి. బీరుట్‌లోని ఓడరేవు పరిసరాల్లో పావుగంట వ్యవధిలోనే రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 78 మంది మృతి చెందగా.. దాదాపు 4 వేల మంది గాయపడ్డారు. పేలుళ్ల ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. బీరుట్ పోర్టు కూడా పూర్తిగా ధ్వంసమైంది. పెద్దమొత్తంలో ఆస్తినష్టం సంభవించింది.