ఇండియాలో లాక్‌డౌన్ తప్పనిసరి : కేసీఆర్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో యావత్ ఇండియా వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం విదితమే. ఏప్రిల్-14 వరకూ ఈ లాక్‌డౌన్ ఉండనుంది. అయితే ఇది పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాత్రి మీడియా మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్ పలు విషయాలను పంచుకున్నారు.

బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చు!

ఇండియాలో లాక్‌డౌన్ కొనసాగక తప్పనిసరి పరిస్థితి అని.. లాక్‌డౌన్ ఎత్తేయాలంటే అంత ఈజీ కాదన్నారు. భారత్‌కు లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్ 3 వరకూ లాక్‌డౌన్ కొనసాగించాలని బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చిందన్నారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అయినప్పటికీ బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఆషామాషీ కాదు..!

‘లాక్‌డౌన్‌పై ప్రతిరోజూ ప్రధాన మంత్రితో మాట్లాడుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ తప్ప వేరే గత్యంతరం లేదు. లాక్‌డౌన్ కొనసాగాలన్నది నా అభిప్రాయం. ప్రధాని అడిగితే లాక్‌డౌన్ కొనసాగించాలని చెప్పాను. లాక్‌డౌన్ సడలించడమంటే అంత ఆషామాషీ విషయం కాదు. లాక్‌డౌన్ ఎత్తేస్తే ప్రజల్ని కంట్రోల్ చేయలేం. లాక్‌డౌన్‌తో ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా.. ప్రాణ నష్టం తగ్గుతుంది. మరణాలు మిగిల్చే విషాదాన్ని దేశం భరించలేదు. మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెడుతున్నారన్న భావన నుంచి ప్రజలు భయపడాలి’ అని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.