close
Choose your channels

చంద్రబాబుకు సడన్ షాకిచ్చిన మమతా!

Monday, February 11, 2019 • తెలుగు Comments

ఏపీ సీఎం చంద్రబాబుకు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెడిందా..? ఇన్ని రోజులు ఇద్దరూ జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వీళ్లు ఎందుకు ఎడమొఖం.. పెడమొఖంలా ఉన్నారు..? మొన్న కొలకత్తాలో జరిగిన భారీ ర్యాలీకి.. నిన్న మమత ఆధ్వర్యంలో జరిగిన దీక్షకు చంద్రబాబు స్వయాన వెళ్లి మద్దతు చెప్పారు.. అయితే ఇవాళ ఢిల్లీ వేదికగా చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మమత ఎందుకు రాలేదు..? ఇందుకు కారణాలేంటి..? అనే విషయాలే ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటున్నారు.

చంద్రబాబు-దీదీ దోస్తీ కొన్నేళ్ల క్రితం నుంచి కొనసాగుతూ వస్తోంది. ఒకప్పుడు వీరిద్దరూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తులే. ఆ తర్వాత తన బద్ధ శత్రువు అయిన ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు చేరడంతో మమత కాస్త గ్యాప్ ఇచ్చారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఎన్డీఏకు ఎదురుదిరిగిన చంద్రబాబు.. బయటికొచ్చేశారు. నాటి నుంచి నేటి వరకూ బీజేపీ-టీడీపీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన తర్వాత మళ్లీ మమతా.. చంద్రబాబు మునుపటిలాగే జాతీయ రాజకీయల్లో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఇద్దరి టార్గెట్ మోదీనే గనుక కేంద్రంపై యుద్ధం చేస్తున్నారు. ఒకరు చేసే పోరాటనికి ఒకరు మద్దతు తెలుపుతూ.. ముందుకెళ్తున్నారు.

అయితే ఫిబ్రవరి 11న జరిగిన ఢిల్లీ వేదికగా జరిగిన ‘ధర్మపోరాట దీక్ష’కు దీదీ రాకపోవడం.. కనీసం మద్దతు కూడా ఇవ్వకపోవడంతో అసలేం జరిగింది..? ఎందుకింత దూరం పాటిస్తున్నారు..? అని  అటు టీడీపీ.. ఇటు తృణముల్ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, పలువురు నేతలు ఆలోచనలో పడ్డారు. జాతీయ స్థాయి నాయకులు వచ్చినప్పడు దీదీ రాకపోవడం వెనుక బలమైన కారణమే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాబు ఇన్నాళ్లుగా హోదా కోసం పోరాడకుండా ఎన్నికల టైమ్‌‌లో హడావుడి చేస్తున్నారనే ఆమె రాలేదా..? అంటే ఇదే నిజమని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బాబుకు ఫోన్ చేసిన దీదీ!

కొన్ని అనివార్యకారణాల వల్ల దీక్షకు హాజరుకాలేపోయిన దీదీ.. చంద్రబాబుకు కాల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో దీక్షకు సంఘీభావం తెలిపారని సమాచారం. కాగా ఇప్పటికే అమరావతి వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సభకు కచ్చితంగా ఏపీకి వచ్చితీరుతానని ఫోన్‌‌లో దీదీ గట్టిగానే చెప్పారని సమాచారం. అయితే మమతా వ్యాఖ్యలకు బాబు నుంచి ఎలాంటి రియాక్షన్ వెళ్లిందనే విషయం తెలియరాలేదు.

దీదీపై కన్నెర్రజేస్తున్న తెలుగు తమ్ముళ్లు..!

ఇదిలా ఉంటే దీదీ దీక్షకు రాకపోవడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమతా చేపట్టిన ర్యాలీకి.. దీక్షకు మద్దతుగా ఏపీ నుంచి కోల్‌‌కతాకు చంద్రబాబు వస్తే.. మీరేమో ఢిల్లీకి రాకపోవడమేంటి..? అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా మమతా రాకుండా ఏదో మొక్కుబడిగా టీఎంసీ తరఫున డెరక్ ఓ బ్రెయిన్ అనే నేతను దీక్షకు పంపడమేంటని మంత్రి నారా లోకేశ్ సైతం ఒకింత కన్నెర్రజేసినట్లుగా తెలుస్తోంది.

అసలు కారణం ఇదేనా..!

సో.. మొత్తానికి చూసే దీదీ రాకపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి కట్టడానికి ఇప్పటికే ఆమె ప్రయత్నాలు మొదలెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన దీక్షకు దాదాపు అందరూ కాంగ్రెస్‌ అనుకూల పార్టీలే రావడంతో దీదీ రాలేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజం..? ఇది కాకుండా ఇంకేమైనా కారణాలున్నాయా అనేది తెలియాలంటే ఇటు చంద్రబాబు కానీ.. అటు మమతాగానీ మీడియా ముందుకు రావాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz