బెంగాల్‌లో దీదీ వర్సెస్ దాదా.. నెగ్గేదెవరో!?

  • IndiaGlitz, [Wednesday,October 16 2019]

దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా..? అందుకే పక్కా ప్లాన్‌తో బీజేపీ అధిష్టానం ప్రస్తుతం బీసీసీఐ చైర్మన్ పదవి కట్టబెట్టి అది పూర్తవ్వగానే కాషాయ కండువా కప్పాలని కమలనాథులు భావిస్తున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థిగా దాదాను ప్రకటిస్తారా..? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఈ నెల 12న బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను.. దాదా కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీసీసీఐ చైర్మన్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం.. నామినేషన్లు దాఖలు చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయ్. పైగా దాదాకు దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో దీన్నే సువర్ణావకాశంగా మలుచుకునేందుకు బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే.. ఈ వ్యవహారంపై గంగూలి స్పందిస్తూ అబ్బే.. అలాంటిదేమీ లేదంటున్నాడు. అమిత్ షా భేటీ అయిన వాస్తవమే కానీ రాజకీయంగా చర్చలేమీ జరగలేదని వివరణ ఇచ్చుకున్నాడు. బీజేపీ మాత్రం ఎప్పట్నుంచో బెంగాల్‌లో పాగా వేయాలని పక్కా వ్యూహాలు రచిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఢీ కొట్టలేకపోతున్నారు. అందుకే దీదీతో దాదానే ఢీ కొట్టించాలని ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే గానీ వర్కవుట్ అయితే బీజేపీ అధికారంలోకి పక్కా అని బీజేపీ నేతలు భావిస్తున్నారట. మరి దీదీతో కూడా దాదాకు మంచి సంబంధాలున్నాయ్.. ఈ క్రమంలో బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. బీసీసీఐపై తనదైన ముద్రవేయాలని కలలు కంటున్న గంగూలీ ఏం చేయబోతున్నారు..? రాజకీయాలకు దూరంగా ఉంటారా..? లేకుంటే బీసీసీఐలో పుణ్యకాలం అయిపోయిన తర్వాత పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తారా..? అనేది దానిపై ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.