తెలంగాణకు భారీ ఆఫర్.. రూ.1200 కోట్ల పెట్టుబడికి మెడ్ ట్రానిక్స్ సిద్ధం

  • IndiaGlitz, [Wednesday,August 12 2020]

మెడికల్ డివైస్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్ ట్రానిక్స్ తెలంగాణను తన పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకుంది. అమెరికా అవతల తన రెండో అతిపెద్ద డెవలప్‌మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సుమారు 1200 కోట్ల రూపాయలతో తన ప్రస్తుత కార్యకలాపాలను విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న తన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని మరింతగా విస్తరించనుంది. ఈ మెడ్ ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు ఇన్నోవేషన్ సెంటర్ అమెరికా అవతల అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కానున్నది రానున్న ఐదు సంవత్సరాలలో ఈ కేంద్రం విస్తరణ కోసం పన్నెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ పెట్టుబడితో మెడికల్ డివైసెస్ హబ్‌గా హైదరాబాద్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

రెండేళ్లుగా చర్చలు..

తెలంగాణ ప్రభుత్వం, మెడ్ ట్రానిక్స్ కంపెనీ గత రెండు సంవత్సరాలుగా ఇందుకు సంబంధించిన చర్చలను కొనసాగిస్తున్నాయి. 2016 లో అమెరికాలో పర్యటించిన సందర్భంగా పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రతినిధి బృందం.. సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఓమర్ ఇస్రాక్‌తో సమావేశమైంది. మంగళవారం ఆయనతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ మేరకు పెట్టుబడికి సంబంధించిన ప్రకటనను తెలియజేయడం జరిగింది. పరిశోధన, అభివృద్ధి అనేది ఇన్నోవేషన్‌కి దారితీస్తుందని, ఇన్నోవేషన్ అనేది తమ కంపెనీ అభివృద్ధికి అత్యంత కీలకమైనదని కంపెనీ చైర్మన్ ఒమర్ ఇస్రాక్ ప్రకటించారు. ఈ రోజు ప్రకటించిన పెట్టుబడి భారతదేశం పట్ల తమ కమిట్‌మెంట్‌కి, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తాము తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తుందని తెలిపారు.

మంత్రి కేటీఆర్ హర్షం..

ఈ కేంద్రం ద్వారా కంపెనీ తన లక్ష్యాలకు అనుగుణంగా కొనసాగుతుందన్నారు. రోగుల బాధను దూరంచేసి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్న తమ కంపెనీ లక్ష్యాలతోపాటు, అరోగ్య రంగాన్ని మరింతగా విస్తరించాలన్న ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఈ భాగస్వామ్యం ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. మంగళవారం జరిగిన వర్చువల్ మీటింగ్ లో భాగంగా మంత్రి కేటీఆర్ మెడ్ ట్రానిక్స్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను వివరించారు. ముఖ్యంగా మెడికల్ డివైస్ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మెడ్ ట్రానిక్స్ కంపెనీ హైదరాబాద్ నగరాన్ని తమ అతి పెద్ద ఆర్‌అండ్‌డి సెంటర్‌కి గమ్యస్థానం ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పనతో పాటు, ఈ రంగంలో మరిన్ని నూతన పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.

మెడికల్ డివైసెస్ హబ్‌గా మారుస్తుంది..

ప్రస్తుతం మెడ్ ట్రానిక్స్ పెడుతున్న పెట్టుబడి హైదరాబాద్ నగరాన్ని భారతదేశ మెడికల్ డివైసెస్ హబ్ గా మారుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మెడ్ టెక్ రంగ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఈరోజు మెడ్ ట్రానిక్స్‌తో జరుగుతున్న ఒప్పందం దీన్ని సూచిస్తుందని తెలిపారు. మెడికల్ డివైసెస్ కంపెనీలతో కలిసి పనిచేస్తూ ప్రపంచ ఆరోగ్య రంగంలో సానుకూల మార్పు దిశగా పని చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార ధోరణులను పరిశీలించినప్పుడు భారతదేశానికి ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు.

ఉపాధి అవకాశాలు వస్తాయి..

కంపెనీ యొక్క భారత ఉపఖండ ఉపాధ్యక్షుడు మదన్ కృష్ణ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న రోగులకు తమ కంపెనీ యొక్క ఆవిష్కరణ ద్వారా ఉపశమనం కల్పించాలన్న ఉద్దేశంతో కంపెనీ ఇన్నోవేషన్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం తాము చేస్తున్న ఈ పెట్టుబడి ద్వారా హెల్త్ కేర్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాల విస్తరణ ద్వారా ఇక్కడి ఇంజనీరింగ్ విద్యార్థులు తమ మెడ్ ట్రానిక్స్ కంపెనీతో కలిసి పని చేసేందుకు వీలు కలుగుతుందని, తద్వారా హెల్త్ కేర్ రంగంలో అనేక మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉందన్నారు. తమ విస్తరణ ద్వారా భారతదేశ మెడికల్ డివైసెస్ ఇన్నోవేషన్ ఈకో సిస్టం బలోపేతం చేసేందుకు కూడా ఉపయోగపడుతుందన్న ఆకాంక్షను మదన్ కృష్ణ వ్యక్తం చేశారు.

More News

సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్.. కరోనా పరీక్ష నిర్వహించగా..

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కి నిర్వహించిన పరీక్షల్లో

బీరుట్ ఘటన ఎఫెక్ట్.. భాగ్యనగర వాసుల్లో టెన్షన్ టెన్షన్..

హైదరాబాద్‌కు అమ్మోనియా నైట్రేట్ టెన్షన్ పట్టుకుంది. కీసర మండలం అంకిరెడ్డి పల్లెకు కంటైనర్స్ చేరుకున్నాయి.

‘నిశ్శ‌బ్దం’ రిలీజ్‌ విష‌యంలో  ప్రేక్ష‌కుల రెస్పాన్స్

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’.

ఓల్డేజ్... పూరి ఇచ్చిన స‌ల‌హా

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొన్ని విషయాలను తన అభిప్రాయాలను చెబుతూ వీడియోలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

ర‌చ్చ స్టార్ట్ చేసిన శ్రీదేవి అభిమానులు

సోష‌ల్ మీడియా ఇప్పుడు భావ ప్ర‌క‌ట‌న‌కు కీల‌క వేదిక‌గా మారింది.