సినీ పరిశ్రమ, జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు. 45 ఏళ్లు పైబడిన వారందరికీ అపోలో సౌజన్యంతో కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా ఉచితంగా వ్యాక్సినేషన్‌ను అందించనున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా మూడు నెలల పాటు అపోలో ద్వారా ఉచితంగా డాక్టర్లను సంప్రదించవచ్చని వెల్లడించారు. మందుల్లో కూడా రాయితీలు లభించే వెసులుబాటును కల్పించనున్నట్టు వెల్లడించారు. అంతే కాదు.. 45 ఏళ్లు దాటిన తెలుగు సినీ కార్మికులు, సినీ జర్నలిస్టుల భాగస్వాములకు సైతం 45 ఏళ్లు దాటితే వారికి కూడా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ఓ వీడియో సందేశం ద్వారా చిరు తెలిపారు.

‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 45 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు అపోలో సౌజన్యంతో మన కరోనా క్రైసిస్ చారిటీ కార్యక్రమం ఈ గురువారం నుంచి నెల రోజుల పాటు చేపట్టనుంది. 45 ఏళ్లు దాటిన తెలుగు సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు మీ అసోసియేషన్స్ లేదా యూనియన్స్‌లో మీ పేరు నమోదు చేసుకోండి. మీతో పాటు మీ జీవిత భాగస్వామికి 45 ఏళ్లు దాటితే వారికి కూడా మీతో పాటు ఈ వ్యాక్సినేషన్ పూర్తిగా ఉచితం. షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు కొందరికీ అపోలో హాస్పిటల్లో తగిన వసతులతో వ్యాక్సినేషన్ ఇస్తారు. అలాగే మూడు నెలల పాటు అపోలో ద్వారా ఉచితంగా డాక్టర్లను సంప్రదించవచ్చు. మందుల్లో కూడా రాయితీలు లభించే వెసులుబాటు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఉంటుంది. కరోనా నుంచి మన పరిశ్రమను మనం కాపాడుకుందాం. ప్లీజ్ దయచేసి ముందుకు రండి వ్యాక్సిన్ వేయించుకోండి. స్టే సేఫ్ అండ్ స్టే స్ట్రాంగ్’’ అని చిరు వెల్లడించారు.