close
Choose your channels

Rewind 2022: రీమేక్స్ తో హిట్టు కొట్టిన 'మెగా'స్టార్లు

Wednesday, December 7, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మరికొద్దిరోజుల్లో పాత సంవత్సరం వెళ్లిపోయి.. కొత్త సంవత్సరం రానుంది. అయితే వెళ్లిపోతున్న పాత సంవత్సరం మనకి అన్నీ హ్యాపీ మూమెంట్స్ ఇచ్చిందా అంటే అందరికీ ఒకేలా వుండదు. కొందరికీ ది బెస్ట్‌గా వంటే, ఇంకొందరికీ మాత్రం చేదుగా వుండొచ్చు. ఏది ఏమైనా కాలచక్రం ఎవ్వరి కోసం ఆగదు. గత సంవత్సరం చోటు చేసుకున్న సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త సంవత్సరంలో జాగ్రత్తగా వుండమని మనకు కాలం చెబుతూ వుంటుంది. ఇక ఈ ఏడాది మెగా కుటుంబానికి బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్‌ నటించిన సినిమాలు రిలీజై... మంచి విజయాలను అందుకున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘‘గాడ్ ఫాదర్’’, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘‘భీమ్లా నాయక్’’ గురించే.

రీమేక్‌లపై మెగా బ్రదర్స్ ఫోకస్:

ఈ రెండు సినిమాలు రీమేక్‌లు కాగా... రెండూ మలయాళం నుంచి దిగుమతి అయినవే కావడం విశేషం. గత కొంతకాలంగా పవన్, చిరంజీవిలు అభిమానులను నిరాశపరుస్తూ వస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలు ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాబట్టకపోవడంతో చిరు రీమేక్‌నే నమ్ముకున్నారు. నిజానికి ఆయనకు రీమేక్‌లు చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలో ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు. అలా తాను మళ్లీ హిట్ కొట్టాలంటూ రీమేక్ చేయాల్సిందేనని ఫిక్స్ అయిన మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘‘లూసీఫర్’’పై కన్నేశారు. అదే గాడ్ ఫాదర్. దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌ షోతోనే మంచి టాక్ సొంతం చేసుకుంది.

చిరు ఇమేజ్‌కు తగ్గట్టుగా గాడ్‌ఫాదర్:

మోహన్ లాల్ హీరోగా నటించిన లూసీఫర్‌ను మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేశారు. దీనిని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తెరకెక్కించారు దర్శకుడు మోహన్ రాజా. నయనతార, సత్యదేవ్‌లకు తోడు సల్మాన్ ఖాన్ మెరుపులతో గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ సినిమా అంటే అభిమానులు చాలా అంశాల్ని కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే అన్ని ఎలిమెంట్స్‌ని మిక్స్ చేసి విందు భోజనం అందించారు మోహన్ రాజా.

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీని రీమేక్ చేసిన పవన్:

ఇక పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. గతేడాది వకీల్ సాబ్‌తో మంచి విజయాన్ని అందుకున్న పవన్.. సక్సెస్‌ను కంటిన్యూ చేసేందుకు గాను మరోసారి రీమేక్‌నే నమ్ముకున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్‌, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మించగా.. సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. రూ.75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పవన్ స్టామినా ఏంటో మరోసారి తెలియజేశాయి.

పవన్ చేతిలో మూడు సినిమాలు:

అలా మెగా బ్రదర్స్‌కి ఈ ఏడాది రీమేక్‌ల వల్ల మంచి విజయాలు దక్కాయి. ప్రస్తుతం ఈ అన్నదమ్ములిద్దరూ చేతినిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు సినిమాను చకచకా పూర్తి చేసే పనిలో వున్నారు. ఇది సెట్స్ మీద వుండగానే హరీశ్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో మరో సినిమాకు పవన్ ఓకే చెప్పేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం వుంది.

సంక్రాంతి కానుకగా వాల్తేర్ వీరయ్య:

ఇక మెగాస్టార్ విషయానికి వస్తే...బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వాల్తేర్ వీరయ్య షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది. సంక్రాంతి కానుకగా వాల్తేర్ వీరయ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘‘భోళా శంకర్’’ సినిమా చేస్తున్నారు చిరు. ఇది వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.