Download App

Metro Review

ఓ మోటివ్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌కు పెద్ద‌గా తావివ్వ‌కుండా సినిమా చేయ‌డంలో త‌మిళ ఇండ‌స్ట్రీ ముందుంటుంది. అలా చైన్ స్నాచింగ్‌పై గ‌త ఏడాది విడుదలైన చిత్రం `మెట్రో`. ఈ సినిమాను తెలుగు రీమేక్ చేద్దామ‌నుకున్న నెటివిటీ స‌మ‌స్య కార‌ణంగా త‌మిళ మెట్రోను అదే పేరుతో తెలుగులో విడుద‌ల చేశారు. గ‌తంలో జ‌ర్నీ, పిజ్జా వంటి త‌మిళ చిత్రాల‌ను తెలుగులోకి అనువాదం చేసి విడుద‌ల చేసిన నిర్మాత సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో మెట్రో సినిమా విడుద‌ల కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ మెట్రో తెలుగు ప్రేక్ష‌కులను మెప్పించిందా..లేదా అని తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ:

మ‌ధ్య త‌ర‌గ‌తివారైనా ఉన్న‌తంగా ఉండే ఓ కుటుంబంలో పెద్ద కొడుకు ఆది(శిరీష్‌) ఓ ప్ర‌తిక‌లో రిపోర్ట్‌గా ప‌నిచేస్తుంటాడు. ఆది త‌మ్ముడు మ‌ధు(నిషాంత్‌) బి.టెక్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతుంటాడు. మ‌ధుకు ఓ గ‌ర్ల్ ఫ్రెండ్ ఉండ‌టం, స్నేహితులంద‌రూ విలాసంగా ఉండ‌టంతో త‌ను కూడా విలాసంగా ఉండాల‌నుకుంటాడు. అందుకోసం ఇంట్లో వారిని ఓ బైక్‌, యాపిల్ ఐఫోన్ కొనివ్వ‌మ‌ని పోరు పెడుతుంటాడు. ఇంట్లోవాళ్ళు కూడా కొన్ని రోజుల త‌ర్వాత మ‌ధుకు బైక్ కొనిపెడ‌దామ‌ని అనుకుంటారు. కానీ అంత వ‌ర‌కు వెయిట్ చేయ‌లేని మ‌న‌స్త‌త్వం ఉన్న మ‌ధు కొంద‌రి మిత్రుల కార‌ణంగా చైన్ స్నాచింగ్ గ్యాంగ్‌లో చేరుతాడు. ఆ గ్యాంగ్ నాయ‌కుడు గుణ‌(బాబీసింహా). మ‌ధు కుటుంబంలో వారికి ఈ విష‌యం తెలిసే లోపే వారి కుటుంబంలో ఓ విషాదం జరుగుతుంది? ఆ విషాద‌మేంటి? ఇంత‌కు త‌న త‌మ్ముడి కోసం ఆది ఏం చేశాడు?  చైన్ స్నాచింగ్ గ్యాంగ్‌లో చేరిన మ‌ధు చివ‌ర‌కు ఏమ‌వుతాడు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్ః

-న‌టీన‌టులు ప‌నితీరు
-క‌థ‌, క‌థ‌నం

మైన‌స్ పాయింట్స్:

- సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ లేకుండా ఒక డైరెక్ష‌న్‌లోనే సాగ‌డం
- ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ల‌వ్ ట్రాక్ వంటివి లేక‌పోవ‌డం

స‌మీక్ష:

ముందుగా న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే శిరీష్ తొలి సినిమానే అయినా పాత్ర‌లో ఒదిగిపోయి చ‌క్క‌గా న‌టించాడు. అలాగే త‌మ్ముడు పాత్ర‌లో న‌టించి నిషాంత్ కూడా మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. నేరాలు చేస్తూనే కామ్‌గా ఉండే కుర్రాడిలా పాత్ర‌కు ప్రాణం పోశాడు. ఇక గ్యాంగ్ లీడ‌ర్ పాత్ర‌లో బాబీ సింహ చేయ‌డం సినిమాకు ప్ల‌స్. బాబీ సింహ పాత్ర ప‌రిమిత‌మే అయినా అద్భుతంగా న‌టించాడు. ఇక తుల‌సి స‌హా అంద‌రూ వారి వారి పాత్ర‌లకు హండ్రెడ్ ప‌ర్సెంట్ న్యాయం చేశారు. ద‌ర్శ‌కుడు ఆనందన్ బ‌ర్నింగ్ ఇష్యూను తీసుకుని ఏదో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో సినిమా చేయాల‌ని కాకుండా చైన్ స్నాచింగ్‌పై బాగా స్ట‌డీ చేసి క‌థ‌ను రాసుకున్నాడు. స్క్రీన్‌ప్లే కూడా చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. జోహ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూప‌ర్బ్‌. ఉద‌య్‌కుమార్ సినిమాటోగ్ర‌ఫీ కూడా బావుంది. ర‌మేష్ భార‌తి ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్‌గా  అనిపిస్తుంది. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న చైన్ స్నాచింగ్ అనే దాని వెనుక ఎంత పెద్ద మాఫియా ఉంద‌నే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు బ‌హిర్గ‌తం చేసిన తీరు ఆశ్చ‌ర్యంగానే అనిపిస్తుంది. అయితే సినిమాలో హీరో, హీరోయిన్ ఉన్నా వారి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ లేక‌పోవ‌డం, పాత్ర‌ల మ‌ధ్య బ‌ల‌మైన ఎమోష‌న్స్ క‌న‌ప‌డ‌వు.

బోట‌మ్ లైన్: మెట్రో... రియాల్టిటీకి ద‌గ్గ‌రగా....

Rating : 2.5 / 5.0