close
Choose your channels

ప్రభుత్వ పథకాలపై వ్యంగ్యాస్త్రాలు.. హాట్ టాపిక్‌గా ఈటల తీరు..

Tuesday, March 23, 2021 • తెలుగు Comments

ప్రభుత్వ పథకాలపై వ్యంగ్యాస్త్రాలు.. హాట్ టాపిక్‌గా ఈటల తీరు..

మంత్రి ఈటల రాజేందర్.. ఒక మంచి వ్యక్తిగా ఆయనకు పేరుంది. గులాబీ పార్టీలో ఓ మంచి స్థానంలో ఉన్న ఆయనకు ఈ మధ్య పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోతోంది. దీంతో ఆయన అసంతృప్తిని అవకాశం దొరికినప్పుడల్లా వెల్లగక్కుతూనే ఉన్నారు. అసలు ఆ మధ్య ఆయన వేరే పార్టీ పెట్టబోతున్నారని సైతం ప్రచారం జరిగింది. కానీ ఆ తరువాత ఈ ప్రచారానికి ఎందుకో బ్రేక్ పడింది. తిరిగి గులాబీ పార్టీకి మరోసారి ఆయన ముల్లుగా మారుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా వీణవంకలో ఈటల మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనకు కల్యాణలక్ష్మి, పెన్షన్లు, రేషన్‌కార్డులు పరిష్కారం కాబోవని తేల్చి చెప్పి ప్రభుత్వ పథకాలపైనే వ్యంగ్యాస్త్రాలు సంధించి హాట్ టాపిక్‌గా మారారు.

ఈ వీణవంక సభలోనే ఈటల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతుబంధు’ పథకంలోని లోపాలను ఎత్తి చూపారు. రైతు చట్టాలపై వ్యతిరేక ఆందోళనలను పార్టీ వ్యూహాత్మకంగా పక్కన బెట్టగా.. ఈటల మాత్రం వాటిని నెత్తికెత్తుకుని మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈటల వ్యవసాయ చట్టాలలోని లోపాలు, రైతుల ఆందోళనలను.. పాలకుల తీరును తూర్పారపట్టారు. రైతులకు సైతం ఈటల భరోసాగా మాట్లాడారు. అలాగే.. గతంలోనూ ఒకసారి హుజూరాబాద్‌లో రైతువేదికల ప్రారంభోత్సవాల సందర్భంగా పార్టీ విధానాలకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా.. కేసీఆర్‌ తన సీఎం పదవి కోసం తగిన సమయం కేటాయించలేక పోతున్నందున త్వరలోనే కేటీఆర్‌ సీఎం కావచ్చంటూ ఈటల కొత్త చర్చకు తెరదీశారు. ఈ చర్చకు ఎమ్మెల్యేలు, మంత్రులంతా తలో చేయి వేసి పైకి లేపడంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి అందరి నోర్లూ మూయించాల్సి వచ్చింది.

ఇప్పుడు వీణవంక సభలో ఈటల ప్రసంగం కొత్త చర్చకు దారితీస్తోంది. అసలు ఆయన మనసులో ఏముంది? ఎందుకింత అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. గతంలో ప్రచారం జరిగినట్టుగా ఈటల కొత్త పార్టీ పెట్టే సూచనలు సైతం సూచాయగా కూడా కనపించడంలేదు. మరి ఎందుకింతలా ప్రభుత్వ పథకాలపైనే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారనేది మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ఇటీవల తమను దెబ్బ తీసిన బీజేపీని రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి దారుణమైన దెబ్బ కొట్టామన్న ఆనందంలో ఉన్న గులాబీ బాసులకు ఈటల తీరు ముల్లులా గుచ్చుకుంటోందనడంలో సందేహం లేదు. దీని తర్వాత సోమవారం శాసనసభ కార్యక్రమాల అనంతరం ఈటలను మంత్రి కేటీఆర్ తన కారులో ఎక్కించుకుని వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. అయితే కేటీఆర్ ఆయనను అసెంబ్లీ సమావేశాలనంతరం తన కారులో స్వయంగా తీసుకెళ్లి ప్రగతి భవన్‌లో ఆయనతో కలిసి లంచ్ చేశారని తెలుస్తోది. మరి గాయపడిన ఈటల మనసుకు కేటీఆర్ ఆయింట్‌మెంట్ పూసి గాయం మాన్పినట్టేనా? లేదంటే గులాబీ బాసులకు ఈ ముల్లు మున్ముందు మరింత గట్టిగా గుచ్చుకోనుందా? అనేది వేచి చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz