close
Choose your channels

KTR:సారీ చెబుతారా.. రూ.100 కోట్లు చెల్లిస్తారా : రేవంత్, బండి సంజయ్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

Wednesday, March 29, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడటం, ఆ వెంటనే ఆయన లోక్‌సభ సభ్యుడి అనర్హుడు కావడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘‘పరువు నష్టం’’ కేసుల ప్రస్తావన ఎక్కువగా జరుగుతోంది. గతంలో నేతలు మాట్లాడిన వీడియోలను నెటిజన్లు జల్లెడ పడుతున్నారు. ఇదిలావుండగా.. తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ మంగళవారం లీగల్ నోటీసులు పంపారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని .. వీటిపై బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో రూ.100 కోట్లు చెల్లించాలని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైతే ఎదుటి వారిపై అసత్యాలు మాట్లాడే హక్కు వీరికి లేదన్న మంత్రి కేటీఆర్.. ఐపీసీ‌లోని 499, 500 సెక్షన్ల కింద పరువు నష్టం దావా నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని .. లేదంటే రూ.100 కోట్ల పరువునష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు.

కేటీఆర్‌పై సంజయ్, రేవంత్ రెడ్డి ఆరోపణలు :

కాగా.. పేపర్ లీక్ వ్యవహారంలో కమీషన్ ఛైర్మన్, ఇతర సభ్యులను మంత్రి కేటీఆర్ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొద్దిరోజులుగా ఆరోపిస్తున్నారు. కేటీఆర్ పీఏకు కూడా ఇందులో పాత్ర వుందని, ఆయన సొంత మండలానికి చెందిన గ్రూప్ 1 అభ్యర్ధులకు 100కు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ ఆరోపించారు. దీనికి కేటీఆర్ బాధ్యత వహించాలని.. మంత్రి వర్గంలోంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటు బండి సంజయ్ సైతం పేపర్ లీక్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల పిల్లలు గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అయ్యారని ఆరోపించారు. లీకేజ్‌కు కేటీఆరే బాధ్యత వహించాలని.. కేసీఆర్ కనుసన్నల్లో నడిచే సిట్ పారదర్శకంగా విచారణ నిర్వహించదని బండి సంజయ్ అన్నారు. లీకేజ్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేటీఆర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇప్పటికే సంజయ్, రేవంత్ రెడ్డిలకు సిట్ నోటీసులు :

వీరిద్దరి వ్యాఖ్యలు నేపథ్యంలో పేపర్ లీక్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చేస్తున్న ఆరోపణలకు సంబంధించి వున్న ఆధారాలను , సమాచారాన్ని తమతో పంచుకోవాలని వారు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే బండి సంజయ్ మాత్రం సిట్ ఎదుట హాజరుకాలేదు. దీంతో ఆయనకు రెండోసారి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.