విజయసాయి మాటకు లెక్కలేకుండా పోయిందా!?


Send us your feedback to audioarticles@vaarta.com


నవ్యాంధ్ర మూడు రాజధానులపై ఎంపీ విజయసాయిరెడ్డి ఓ మాట.. తాజాగా మంత్రి పేర్ని నాని మరో మాట చెప్పారు. దీంతో అసలు ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో నవ్యాంధ్ర ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించి తర్వాత ముఖ్యమంత్రి జగన్ తొలిసారి ఇక్కడకు రాబోతున్నారంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నానిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. రాజధానిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. త్వరలో ఏర్పాటు చేయబోయే హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. విశాఖ వైసీపీ ఇన్చార్జిగా ఆయన మాట్లాడి ఉండవచ్చన్నారు.
నంబర్-02 మాటకే లెక్కలేదా!?
వాస్తవానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి వైసీపీలో నంబర్-02గా ఉన్నారు. ఆయన నోటి నుంచి మాట వస్తే వైఎస్ జగన్ చెప్పినట్లేనని అంటుంటారు. అలాంటిది.. ఆయన ముందుగానే విశాఖ ఎగ్జిక్యూటివ్ సిటీ అనిచెప్పడం.. రేపు వైఎస్ జగన్ విశాఖ వెళ్తుండటంతో ఉత్తరాంధ్ర వాసులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ కేబినెట్ భేటీ జరగడం.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నాని పై విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అసలు విజయసాయి మాటలకు లెక్కలేకుండా పోయిందా..? అనే అనుమానాలు సైతం వస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎవరికీ అన్యాయం చేయం!?
చంద్రబాబులాగా, లోకేశ్ లాగా అవసరాల కోసం అడుగులు వేసేవాళ్లం కాదని, జీఎన్ రావు ఎంతో బాధ్యతాయుతమైన వ్యక్తి అని ఆయన నివేదికను గౌరవించాలని సూచించారు. ఎవరికోసమో కాకుండా, రాష్ట్ర పరిస్థితులను వాస్తవికంగా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల రైతుల గురించే కాకుండా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ పరిగణనలోకి తీసుకునే విధంగానే సీఎం జగన్ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలకు సాధ్యమైనంత మేర సాయం చేయాలనే వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు.
జగన్‌కు ఎవరూ శత్రువుల్లేరు!?
‘సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఎవరూ శత్రువులు ఉండే పరిస్థితి లేదు.. సామరస్యపూర్వకంగా వెళ్లాలనుకునే వ్యక్తి జగన్. చాలామంది అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఎంతసేపూ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకునేందుకు జీఎన్ రావు కమిటీ వేశారని, ఓ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తిరుమల ఆలయంలోకి చెప్పులేసుకెళ్లారని ఎలా ఆరోపించారో, ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు కూడా అలాంటివే’ అని మంత్రి వివరించారు.
ఆ కమిటీ ఎలా చెబితే అలానే..!
‘ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమం, ప్రజల అవసరాలు, అభివృద్ధి, భవిష్యత్తు చూడాలా..? ఊహాజనితమైన కలల రాజధాని ఇక్కడ ఎప్పటికి నిర్మాణం చేయగలం. లేదా ప్రజల బాగోగులను, చదువు, ఆరోగ్యం ప్రతీది పక్కకుపెట్టి రాజధాని నిర్మాణం చేస్తే హైదరాబాద్, మద్రాస్, బెంగళూరుతో ఎప్పటికి పోటీపడే పరిస్థితి వస్తుందనేది మంత్రిమండలి చర్చించడం జరిగింది. జీఎన్‌రావు కమిటీ, బీసీజీ అధ్యయన కమిటీలపై హైపవర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో నిపుణులు, సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తాం. రెండు రిపోర్టులను అధ్యయనం చేసి హైపవర్ కమిటీ రిపోర్టు అందించేందుకు మంత్రిమండలి మార్గదర్శకాలను ఏర్పాటు చేసుకుంది. జీఎన్‌రావు కమిటీ శివరామకృష్ణ కమిటీ రిపోర్టును కూడా అధ్యయనం చేసింది’ అని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
రాజధాని ఏది రాసుకోవాలి సార్!?
ఏపీ రాజధానిగా ఏ పేరు రాసుకోవాలని మంత్రిని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. మీ పేరేంటి? మీదే చానల్? రాజధాని పేరు మీరు ఎప్పుడు రాసుకుంటారు? అంటూ అసహనంతో తిరిగి ప్రశ్నించారు. దాంతో ఆ మీడియా ప్రతినిధి నెల రోజుల తర్వాత రాసుకోవడానికి అడుగుతున్నాం అని బదులివ్వగా, అప్పుడు రండి చెబుతాం అంటూ సమాధానం వెల్లడించకుండానే ఆ మీడియా ప్రతినిధికి నిరాశ కలిగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments