Modi: అయోధ్యలో అద్భుత ఘట్టం.. ప్రధాని మోదీ భావోద్వేగం..

  • IndiaGlitz, [Wednesday,April 17 2024]

దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామనవమి కావటంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రామ్‌లల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. రామమందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించిన శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని కృప వల్లే ఈ ఏడాది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను చూడగలిగానని భావోద్వేగానికి గురయ్యారు.

శ్రీరామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నా హృదయం భావోద్వేగం, కృతజ్ఞతతో నిండిపోయింది. శ్రీరాముని కృప వల్లే నేను ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను వీక్షించాను. ఆ క్షణాలు ఇప్పటికీ నా మదిలో శక్తిని నింపుతున్నాయి. అయోధ్య దివ్య మందిరంలో మన రామ్‌లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి రామనవమి ఇది. ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యం లభించింది. ఇది దేశ ప్రజల ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితం.

శ్రీరాముడు భారతీయ ప్రజల హృదయాల్లో ఉన్నాడు. ఆలయ నిర్మాణం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన అసంఖ్యాక రామభక్తులు, సాధువులు, మహాత్ములను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మర్యాద పురుషోత్తముడి జీవితం, ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన ఆధారం అవుతాయని నా పూర్తి నమ్మకం. ఆయన ఆశీస్సులు స్వయంసమృద్ధ భారత్‌ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తాయని విశ్వసిస్తున్నాను. శ్రీరాముని పాదాలకు ప్రణామాలు అని మోదీ ట్వీట్ చేశారు.

ఇక శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. గుడి మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని సూర్య తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు బాలరాముడి విగ్రహం నుదుట సూర్యకిరణాలతో తిలకం ఏర్పాటుచేయనున్నారు. అలాగే ఈరోజు కూడా రెండు నిమిషాల పాటు రామ్‌లల్లా నదుటి మీద సూర్యకిరణాలు ప్రదర్శింపచేశారు. ఈ అద్భుత దృశ్యం చూసేందుకు లక్షలాది మంది ప్రజలు అయోధ్యకు వెళ్లగా.. కోట్లాది మంది టీవీల్లో ప్రత్యక్షప్రసారం ద్వారా చూసి తన్మయత్వం చెందారు.

More News

YSRCP: ఏపీ ఎన్నికలపై మరో జాతీయ సంస్థ సర్వే.. వైసీపీ ప్రభంజనం ఖాయం..

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. పోలింగ్‌కు నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Konchem Hatke:‘కొంచెం హట్కే’ పెద్ద విజయం సాధించాలి: డైరెక్టర్ నందినీ రెడ్డి

గురు చరణ్, కృష్ణ మంజూష ప్రధాన పాత్రల్లో అభిమాన థియేటర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మాణంలో అవినాష్ కుమార్ తీసిన చిత్రం ‘కొంచెం హట్కే’.

Pemmasani:టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పరిశ్రమలు తీసుకొస్తాం: పెమ్మసాని

రాష్ట్రంలో  వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు భయపడి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నాయని గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్. పెమ్మసాని చంద్రశేఖర్

BJP:సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. త్రిముఖ పోరుకు సిద్ధం..

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉపఎన్నికకు తమ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది.  టీఎన్‌ వంశా తిలక్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ అధిష్టానం తాజాగా ప్రకటన విడుదల చేసింది.

YCP Candidate:దళితులకు శిరోముండనం కేసులో వైసీపీ అభ్యర్థికి జైలు శిక్ష

వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు(Thota Trimurthulu)కు భారీ షాక్ తగిలింది.