close
Choose your channels

అలీకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయిపోయినట్లేనా!

Thursday, January 10, 2019 • తెలుగు Comments

అలీకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయిపోయినట్లేనా!

టాలీవుడ్ నటుడు అలీకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయ్యిందా..? ఇటీవల ఓ మంత్రితో జరిగిన భేటీలో టికెట్ వ్యవహారం తేలిపోయిందా..? టికెట్ ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారా..? త్వరలోనే మంత్రితో కలిసి అలీ.. చంద్రబాబును కలవబోతున్నారా..? ఎప్పట్నుంచే రాజకీయ యోగం కోసం వేచి చూస్తున్న అలీకి త్వరలోనే మంచిరోజులు రాబోతున్నాయా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది.

గుంటూరు తూర్పు టికెట్ కన్ఫామ్ అయ్యిందా..!?
ఇప్పటికే పలుమార్లు టికెట్ కోసం భగీరథ ప్రయత్నాలు చేసి దక్కించుకోలేకపోయిన అలీకి తాజాగా మంత్రి గంట శ్రీనివాసరావుతో భేటీ అయిన అనంతరం ఆశలు మళ్లీ చిగురించాయట. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో తాను గడచిన 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నానని.. తనకు గుంటూరు తూర్పు నుంచి పోటీ చేయాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టాడు. చంద్రబాబుకు గంటా మంచి సన్నిహితుడు కావడంతో ఈయన్ను సంప్రదిస్తే సీటు కన్ఫామ్ అవుతుందని భావించిన అలీ సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఇందుకు స్పందించిన గంటా తనవంతుగా ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారని సమాచారం. 2014 ఎన్నికల్లో గంటా తరఫున అలీ ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

నన్నెవరూ ఆహ్వానించలేదు..!
అన్నగారు ఉన్నప్పట్నుంచి టీడీపీ అంటే అలీకి ప్రాణం.. ఇంత వరకూ అఫిసియల్‌‌గా కండువా కప్పుకోకపోయినా అన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ వచ్చారు. ఆఖరికి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు కూడా. ఎన్టీఆర్ మరణాంతరం మెగా ఫ్యామిలీకి భక్తుడిగా మారిన అలీ.. పవన్ స్థాపించిన జనసేనలో చేరతారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన ఆయన ఇంత వరకూ తనకు పవన్‌‌ నుంచి పిలుపురాలేదన్నారు. ఈ సందర్భంగా జగన్‌తో భేటీపై మాట్లాడుతూ తాను మర్యాదపూర్వకంగానే కలిశాను అంతే తప్ప తాను వైసీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవమేనని కొట్టిపారేశారు.

ఈ భేటీ దేనికి సూచకం..!
తాను మర్యాపూర్వకంగానే కలిశానని చెప్పుకుంటున్న అలీ మొదట చంద్రబాబుతో భేటీ అయ్యి తర్వాత గంటాతో సమావేశం కావడాన్ని చూస్తుంటే ఏదో పెద్ద తతంగమే నడుస్తున్నట్లుగానే అనిపిస్తోంది. మొదట చంద్రబాబుతో సీటు గురించి మాట్లాడగా ఆయన చూద్దాంలే అని కచ్చితమైన హామీ ఇవ్వకపోవడంతో తనను రెకమెండ్ చేయని గంటాతో చర్చించినట్లుగా సమాచారం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో ఆయన అదే సీటు కావాలని గట్టిగా టీడీపీని పట్టుబట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మొదట రాజమండ్రి పోటీ చేయాలని భావించిన అలీ తాజాగా.. రూటు మార్చి  రాజమండ్రి నుంచి గుంటూరు తూర్పుకు వచ్చి వాలిపోయారన్న మాట.

ఒక వేళ టికెట్ ఇస్తే..!
గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో రెండు సార్లు ముస్లిం అభ్యర్థులే గెలిచారు. సామాజిక వర్గం ప్లస్ పాయింట్ కావడంతో  2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన మహ్మద్ ముస్తఫాని విజయం వరించిందనే చెప్పుకోవచ్చు. గత  ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి తెలుగువాడు కావడంతో మైనస్ అయిందని అందుకే తనకు టికెట్ ఇస్తే తన సత్తా ఏంటో చూపించుకుంటానని చంద్రబాబు, గంటా దగ్గర నిశితంగా వివరించారని టాక్. ఒక వేళ అలీకి టికెట్ ఇస్తే పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా అనే విషయంపై టీడీపీ అధిష్టానం బేరీజు చేస్తోందని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో అలీకి టికెట్ ఇస్తారా..? లేకుంటే పక్కనపెట్టేస్తారా..? అనేది తెలియాలంటే చంద్రబాబు అభ్యర్థుల జాబితా విడుదల చేసేవరకు వేచి చూడాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz