close
Choose your channels

మంత్రి పదవి రేసులో రోజా.. ఆర్కేను అదృష్టం వరించేనా!?

Wednesday, February 5, 2020 • తెలుగు Comments

మంత్రి పదవి రేసులో రోజా.. ఆర్కేను అదృష్టం వరించేనా!?

వైసీపీ ఎమ్మెల్యే రోజా, ఆర్కేలకు ఈసారైనా మంత్రి అనే ట్యాగ్‌లు వస్తాయా..? ఇప్పటికే ఓసారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఈ ఇద్దరికీ ఈసారైనా దక్కేనా..? అప్పట్లో ఆశలు గల్లంతు.. ఇప్పుడు మళ్లీ చిగురించాయా..? రోజా, ఆర్కే రేసులో ఉన్నారా లేదా..? అసలు సీఎం జగన్ మనసులో ఏముంది..? రెడ్డి సామాజిక వర్గానికి జగన్ మరో మంత్రి పదవి ఇవ్వబోతున్నారా..? ఒక వేళ ఇచ్చే ఆలోచన ఉంటే ఎవరికి ఇవ్వొచ్చు..? ఆ జాబితాలో రోజా, ఆర్కే ఉన్నారా..? ఇంతకీ మంత్రిగా ‘రోజా’ వికసించేనా!? లేదా..? అనేది www.indiaglitz.com అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

గతంలో ఆశపడ్డారు కానీ...!
ఆంధ్రప్రదేశ్-2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ గెలుస్తుందని మాత్రమే నేతలు అనుకున్నారు కానీ.. 151 అసెంబ్లీ స్థానాల్లో.. 22 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తారని మాత్రం బహుశా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఊహించి ఉండరేమో. ప్రభుత్వం ఏర్పాటైపోయింది.. ముందుగా అనుకున్నట్లుగా.. పదే పదే జగన్ చెబుతున్నట్లుగానే కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేస్తూ.. మరీ ముఖ్యంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు జగన్ పెద్ద పీఠ వేశారు. అంతేకాదు.. డిప్యూటీ సీఎం పదవుల్లో కూడా కూర్చోబెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరైతే మంత్రి పదవులు తమను వరిస్తాయని ఆశపడ్డారో వాళ్ల ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఆ జాబితాలో మొదటి వరుస మొట్టమొదటి ఎమ్మెల్యే.. రోజా అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండో వ్యక్తి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వీరిద్దరూ జగన్ సామాజిక వర్గం కావడంతో.. వీరికంటే సీనియర్లు.. అనుభవం ఉన్నవారిని మంత్రి సీట్లో కూర్చొబెట్టారయన. దీంతో ప్రమాణ స్వీకారానికి ముందు వరకూ ఆశలుపెట్టుకున్న రోజా, ఆర్కేలకు నిరాశే ఎదురైంది.

ఈ‘సారీ’నేనా!?
వాస్తవానికి ఇప్పుడున్న మంత్రులు రెండు లేదా రెండున్నరేళ్లు మాత్రమే ఉంటారని.. అయితే పనితీరు సరిగ్గా లేకపోయినా.. అవినీతికి పాల్పడినట్లు తెలిసినా ఏ మాత్రం ఆలోచించకుండా పదవులు ఊడతాయని కూడా హెచ్చరించారు.. పదే పదే హెచ్చరిస్తున్నారు కూడా. దీంతో రెండున్నరేళ్లు తర్వాత అయినా కచ్చితంగా తమకు మంత్రి పదవులు రావడం పక్కా అని రోజా, ఆర్కే అనుకున్నారు. అయితే రెండున్నరేళ్లు కాదు కదా సరిగ్గా ఏడాది కూడా ముగియక మునుపే ఆ అవకాశం రానే వచ్చింది. శాసనమండలి రద్దు చేస్తున్నట్లు జగన్ సంచలన ప్రకటనతో ఎమ్మెల్సీలై మంత్రి పదవులు దక్కించుకున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరికీ పదవులు ఊడిపోతున్నాయ్. దీంతో రోజాకు మళ్లీ ఆశలు పుట్టాయ్. రోజాకు ఈ ‘సారీ’నా లేదా పదవి పక్కాగా వస్తుందా అనేది మాత్రం తెలియరావట్లేదు.

ఇద్దరికీ ఖాయమా!?
రెండోసారి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఇస్తామని పక్కాగా జగన్ తేల్చిచెప్పారని అప్పట్లో వార్తలు వినవచ్చాయి. అయితే రోజా మాత్రం ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. మరి ఆ ఆశలు నెరవేరుతాయా..? లేదా మళ్లీ నిరాశేనా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు గుంటూరు జిల్లా నుంచి మంత్రిగా వ్యవహరిస్తున్న మోపిదేవి రాజీనామా చేయడంతో ఆ పదవి అదే జిల్లాకు చెందిన ఆళ్లకు వస్తుందని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే ఇద్దరికీ పదవులు మాత్రం పక్కా అని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. వీరిద్దరి భవితవ్యం అటు కేంద్రం.. ఇటు వైఎస్ జగన్ చేతిలో ఉందన్న మాట. శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రం ఆమోదించేస్తే ఎవరికి మంత్రి పదవులు అనేవి తేలిపోతాయ్. మరి కేంద్రం ఎప్పుడు ఆమోదిస్తుందో.. ఎప్పుడు జగన్ కేబినెట్ విస్తరణ చేస్తారో..!?

గతంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వైసీపీ ఎమ్మెల్యే వీరే...
01. చిత్తూరు జిల్లా: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా రెడ్డి
02. గుంటూరు : ఆళ్ల రామకృష్ణారెడ్డి
03. నెల్లూరు : ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి)
04. గుంటూరు : ఎమ్మెల్యే అంబటి రాంబాబు (సత్తెనపల్లి)
05. కర్నూలు జిల్లా : శిల్పా చక్రపాణి
06. పశ్చిమ గోదావరి : ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (పోలవరం)
07. కడప జిల్లా : ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి)
08. రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
09. అనంతపురం : అనంత వెంకట్రామిరెడ్డి
10. అనంతపురం : కాపు రామచంద్రారెడ్డి
11. చంద్రగిరి ఎమ్మెల్యే : చెవిరెడ్డి భాస్కరరెడ్డి

కాగా.. వీరిలో ఇప్పుడు ఇద్దరి మాత్రమే అవకాశం ఉండగా.. ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పైన చెప్పిన లిస్ట్‌లో చాలా మందే రెడ్డీలు ఉన్నారు. వీరిలో శ్రీకాంత్ రెడ్డి, రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు ముందు వరుసలో ఉన్నారు. మరి మంత్రి పదవి ఎవర్ని వరిస్తుందో.. జగన్‌ ఎవరికి ప్రియార్టీ ఇస్తారో వేచి చూడాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz