close
Choose your channels

ఇంత దారుణమా?.. చాలా బాధాకరం: నాగబాబు

Monday, April 22, 2019 • తెలుగు Comments

ఇంత దారుణమా?.. చాలా బాధాకరం: నాగబాబు

ఏపీ ఎన్నికల అనంతరం మళ్లీ ‘మై ఛానల్ నా ఇష్టం’ అంటూ మెగాభిమానులు, జనసేన కార్యకర్తల ముందుకు జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు వచ్చేశారు. ఈసారి సీరియస్ విషయాలపై ఆయన ఓ వీడియో చేశారు. ఇంటర్ ఫలితాల అనంతరం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో తీవ్ర కలత చెందిన ఆయన ఓ వీడియో చేశారు. విద్యార్థులు ఇలా చనిపోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది చాలా బాధాకరం..

"కేవలం చదువులో ఫెయిల్ అయ్యామన్న కారణంతో విద్యార్దులు చనిపోతున్నారు.. తాజాగా తెలంగాణలో ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన కారణంగా ఇద్దరు ముగ్గురు చనిపోయారు. ఇది నన్ను చాలా కలచివేసింది. జీవితం అన్నది కేవలం చదువులోను ఉంటుందనే అపోహ విద్యార్ధుల్లో కలిగేలా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ఉన్నాయి. ఒక జీవితం చనిపోవడం అంటే ఆ కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుంది. ఒక పదహారేళ్ల పిల్లాడు ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయ్యానన్న కారణంతో చనిపోవడాన్ని చూస్తే.. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం అనిపిస్తుంది. పాస్ అయిన వాడిదే జీవితం.. ఫెయిల్ అయిన వాడు ఎందుకూ పనికి రాడనే కండిషన్స్ చాలా బాధాకరం" అని నాగబాబు చెప్పుకొచ్చారు.

ఇంత దారుణమా..?

"నువ్ డాక్టర్ అవ్వాలి.. ఇంజనీర్ కావాలి.. ఇన్ని మార్కులు రావాలి అంటూ కండిషన్స్ పెడుతున్నారు. బతకాలంటే ఇలాగే బతకాలని వాళ్లని బలవంతం చేస్తున్నారు. కమర్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిన తరువాత విద్యార్ధుల్ని 18 గంటల పాటు చదివిస్తున్నారు. ఇంత దారుణమా? మనిషి 18 గంటలు చదవాలా? ర్యాంక్‌ల కోసం విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నారు" అని నాగబాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

బలవంతం ఏంటి..?

"వాళ్లు ఇష్టమైతే చదువుతారు.. అంతేకాని బలవంతంగా చదివించడం ఏంటి? నువ్ చదువు లేకపోతే చనిపోతావ్ అని ఎందుకు చెబుతున్నారు. డాక్టర్ కాకపోతే బతలేమా? ఇంజనీర్ కాకపోతే బతకలేమా? ముందు ఎలా బతకాలన్నది పేరెంట్స్ నేర్పించాలి. నువ్ చదువుకో అని చెప్పడంలో తప్పులేదు. కాని ఇదే చదవాలని ఎందుకు చెబుతున్నారు. దయచేసి ఒత్తిడితో చదవొద్దు. పరీక్షలో ఫెయిన్ అయితే ఆత్మహత్యలు చేసుకోవద్దు.. విద్యార్ధుల్ని ఒత్తిడికి గురి చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలి" అని నాగబాబు కోరారు. నాగబాబు వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీలో ఓ రాజకీయ నేత కనిపిస్తున్నారు సార్.. అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

Get Breaking News Alerts From IndiaGlitz