దేవుడా.. ఈ జనాల మనసు మార్చు!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అన్నదమ్ములు.. పవన్ కల్యాణ్ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో.. నాగబాబు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి అప్పుడప్పుడు జనాల్లో పవన్ తిరుగుతూ.. ఇటు సినిమా షూటింగ్‌లో బిజిబిజీగా ఉన్నారు. మరోవైపు నాగబాబు సైతం అప్పట్లో అమరావతే రాజధాని ఉండాలంటూ రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని ఆ తర్వాత ‘అదిరింది’షోకే పరిమితమై.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్ చల్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రజలను ఉద్దేశించి.. జగన్ సర్కార్‌ను ఉద్దేశించి వరుస పోస్ట్‌లు చేసిన ఆయన తాజాగా మరోసారి ఏపీ ప్రజలపై తన అసంతృప్తిని వెల్లగక్కుతూ ట్వీట్ చేశారు.

దేవుడా.. !
‘ఏపీ ప్రజలు లైఫ్ ఇస్తానన్న వాడిని ఓడిస్తారు. లైఫ్ తీసుకొనే వాళ్లని అధికార, ప్రతి పక్షాలుగా ఎన్నుకొంటారు.. ఏమిటో ఈ జనం. దేవుడా ఈ జనాల మనసు మార్చు (ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్)' అంటూ ట్వీట్ చేశారు. అంటే..తమరికి ఓట్లేసి గెలిపించకపోతే.. జనాలను ఇలా చిత్ర విచిత్రాలుగా వక్రీకరిస్తారా అంటూ నెటిజన్లు, మెగాభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొదరైతే అవున్లెండి.. మీ ఇంట్లో ఇద్దరు పోటీ చేసినా అట్టర్ ప్లాప్ అయ్యారుగా.. ఆ మాత్రం అసంతృప్తి లేకుంటే ఎలా అంటూ తెగ తిట్టిపోస్తున్నారు. మరికొందరైతే ‘కొన్ని జీవితాలు అంతే మారవు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.