నిర్మాతకు ఒక రూపాయి మిగలాలని తపించేవారు : తాతినేని మరణంపై బాలయ్య దిగ్భ్రాంతి
- IndiaGlitz, [Wednesday,April 20 2022]
సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. రీమేక్ స్పెషలిస్ట్‌గా, సాంఘీకాలలో ట్రెండ్ సెట్టర్‌గా రామారావు పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో సక్సెస్ అయిన అతి కొద్దిమంది తెలుగు దర్శకుల్లో ఒకరిగా తాతినేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణం పట్ల అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్నగారి కుటుంబంతో రామారావుకు సన్నిహిత సంబంధాలు వున్నాయి. ఎన్టీఆర్‌తో యమగోల వంటి బ్లాక్‌బస్టర్ తీశారు తాతినేని. ఈ నేపథ్యంలో ఆయన మరణం పట్ల బాలయ్య సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘దర్శకుడు అనే మాటకు వన్నెతెచ్చిన దర్శకులు తాతినేని రామారావు గారు ఈరోజు మనమధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. తాతినేని రామారావు గారి మరణ వార్త నన్నెంతగానో కలచివేసింది. తాతినేని రామారావు గారు అద్భుతమైన దర్శకులు. నాన్నగారితో చరిత్రలో నిలిచిపోయే 'యమగోల' లాంటి విజయవంతమైన చిత్రాలు తీసి మేటి దర్శకులుగా నిలిచారు. ఆయన దర్శకత్వంలో నేను కథానాయకుడిగా చేసిన 'తల్లితండ్రులు' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి అభిమాన చిత్రంగా నిలిచింది. నిర్మాత పక్షాన నిలబడి, నిర్మాతకు ఒక రూపాయి మిగలాలని ఆలోచిస్తూ, అదే సమయంలో సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాలు నిర్మించే ప్రతిభ తాతినేని రామారావు గారి సొంతం. బాలీవుడ్ లోనూ హిట్ చిత్రాలు తీసి అక్కడా విజయవంతమైన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తాతినేని రామారావు గారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ’’ అని బాలకృష్ణ తెలిపారు.
కాగా.. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తాతినేని రామారావు మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తాతినేని కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు.