Alekhya Reddy:తారకరత్న మరణంతో డిప్రెషన్లోకి.. ప్రశాంతత కోసం తాపత్రయం, కోయంబత్తూరుకి అలేఖ్యా రెడ్డి


Send us your feedback to audioarticles@vaarta.com


సినీనటుడు నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది. 39 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన తిరిగిరాని లోకాలకు తరలిపోవడాన్ని నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడే తారకరత్న చనిపోయి రోజులు గడుస్తున్నాయి. మరోవైపు ఆయన సతీమణి అలేఖ్యారెడ్డి , పిల్లలు ఇప్పుడు దిక్కులేనివారు అయ్యారు. ఇక అలేఖ్యా రెడ్డి భర్త మరణంతో బాగా కృంగిపోయారు. కష్ట సుఖాల్లో తోడుగా వున్న ఆయన లేకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయారని ఫిలింనగర్ టాక్. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా తారకరత్నను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆయనతో వున్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.
అలేఖ్యను జీవితంలో బిజీగా మార్చాలనుకుంటున్న బాలయ్య :
మరోవైపు.. అలేఖ్యను డిప్రెషన్‌లోంచి బయటపడేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఈ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు ఏదో ఒక బాధ్యత అప్పగిస్తే.. పనుల్లో పడి తిరిగి మామూలు మనిషిగా మారుతారని ఆయన యోచిస్తున్నారు. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగంలో కానీ, మరేదైనా రంగంలో కానీ అలేఖ్యకు పనులు చెప్పాలని బాలయ్య భావన. దీనిపై ఆయన గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇషా ఫౌండేషన్‌లో గడపనున్న అలేఖ్యా రెడ్డి:
ఇదిలావుండగా.. అలేఖ్య రెడ్డి మానసిక ప్రశాంతత నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా వెళ్లారు. ఫిలింనగర్ టాక్ ప్రకారం.. ఆమె కోయంబత్తూరులోని సద్గురు ఇషా ఫౌండేషన్‌కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. పెద్ద కుమార్తె నిష్కతో కలిసి అలేఖ్య కొంతకాలం అక్కడే వుంటారని టాక్. ఇషా ఫౌండేషన్‌కు అనేక మంది ప్రముఖులు, సెలబ్రెటీలు వెళ్తూ వుంటారు. మానసికంగా ప్రశాంతంగా వుండేందుకు గాను యోగా, మెడిటేషన్, దైవారాధన చేస్తూంటారు. ఈ క్రమంలోనే అలేఖ్య కూడా కోయంబత్తూరు వెళ్లారు.
పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:
కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో ఇటీవల యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్నను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆయన శివరాత్రి రోజున శివైక్యం చెందారు. తారకరత్న ఆకస్మిక మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.