Download App

Nannu Dochukunduvate Review

హీరోలు రోజూ ఎన్నో క‌థ‌ల‌ను వింటుంటారు. అన్నీ తామే చేయాలంటే కుద‌ర‌దు. కొన్నిసార్లు మ‌న‌సుకు నచ్చిన క‌థ‌లుంటాయి. వాటిని ఇత‌ర నిర్మాత‌లు నిర్మించ‌డానికి ముందుకు రారు. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా త‌న‌కు న‌చ్చిన క‌థ‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి సుధీర్‌బాబు న‌డుంబిగించారు. అందులో భాగంగానే సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్స్ సంస్థను ఏర్పాటు చేశారు. త‌న త‌ల్లి రాణి పోసాని స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమాను రూపొందించారు. ఆయ‌న న‌మ్మి చేసిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందా? జ‌స్ట్ గో త్రూ..

క‌థ‌:

కార్తిక్ (సుధీర్‌బాబు)కి ఉద్యోగం అంటే ప్రాణం. అత‌ను సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌. త‌న టీమ్ స‌ర‌దాగా ఉన్నా త‌ట్టుకోలేడు. ఆఫీసులో ఉన్న‌న్ని గంట‌లూ సంపూర్ణంగా శ్ర‌మించాల‌ని అనుకుంటాడు. అలా గోల్ ఓరియంటెడ్‌గా పెరిగిన అత‌నికి యు.ఎస్‌. వెళ్లాల‌న్న‌ది క‌ల‌. అయితే అత‌ని మ‌ర‌ద‌లు స‌త్య‌ని పెళ్లి చేసుకోమ‌ని మావ‌య్య అడుగుతాడు. కార్తిక్ ఓకే అన్నా.. త‌న‌కు వేరే వ్య‌క్తితో ప్రేమ ఉంద‌ని, ఈ పెళ్లిని కేన్సిల్ చేయ‌మ‌ని కార్తిక్‌ని స‌త్య అడుగుతుంది. దాంతో త‌న ఆఫీసులో ప‌నిచేసే సిరి (న‌భా న‌టేశ్‌)ని ప్రేమిస్తున్నాన‌ని చెబుతాడు కార్తిక్‌. చెప్పిన అబ‌ద్ధాన్ని నిజం చేయ‌డానికి సిరి అనే పేరుతో షార్ట్ ఫిల్మ్స్ లో న‌టిస్తూ చ‌దువుకుంటూ ఉన్న మేఘ‌న‌ను ప్రవేశ‌పెడ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది?  వారిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ప్రొఫెష‌న‌ల్‌గానే ఆగిందా?   లేకుంటే పెళ్లికి దారి తీసిందా..?  వారిద్ద‌రూ నిజ‌మైన ప్రేమికులు కాద‌న్న సంగ‌తి వారికి తెలిసిపోయిందా? అనేది ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్లు:

ట‌ఫ్ బాస్‌గా, సందిగ్ధంలో ఉన్న కుర్రాడిగా, తండ్రిని ఉన్న‌త స్థానంలో చూడాల‌నుకునే బాధ్య‌త గ‌ల కుర్రాడిగా, యాంబిషియ‌స్ గైగా సుధీర్‌బాబు బాగానే న‌టించారు. నాజ‌ర్‌తో పాటు అంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. న‌భాని చూస్తున్నంత సేపు ఓ వైపు నందిత‌, ఓ వైపు శ్రీదిత్య‌.. బొమ్మ‌రిల్లులో హాసిని పాత్ర‌.. ఇలా చాలానే గుర్తుకొచ్చాయి. వైవా హ‌ర్ష కామెడీ సినిమాకు హైలైట్‌. పాట‌ల‌ను పిక్చ‌రైజ్‌చేసిన తీరు బావుంది. కాస్ట్యూమ్స్ బావున్నాయి.

మైన‌స్ పాయింట్లు:

హీరో పాత్ర కొత్త కాదు. ఆర్య‌2లో అల్లు అర్జున్ పాత్ర నుంచి ఇలాంటి ట‌ఫ్‌, మూడీ బాస్‌లు చాలా సినిమాల్లో మ‌న‌కు కనిపిస్తారు. క‌థ‌లో కూడా కొత్త‌ద‌నం ఏమీ లేదు. అనుకోని సంద‌ర్భాల్లో ఇంట్లో వాళ్ల‌తో అబద్ధాలు చెప్ప‌డం.. చెప్పిన దానికోసం ఓ అమ్మాయిని తీసుకెళ్ల‌డం, అనుకోకుండా క్ర‌మంగా ఆ అమ్మాయి ప్రేమ‌కు అట్రాక్ట్ కావ‌డం వంటి పాయింట్స్ మ‌నం చాలా సినిమాల్లో చూశాం. క‌థ‌నంలో కూడా గొప్ప‌గా ఏమీ లేదు. ఆక‌ట్టుకునే ఒన్ లైన‌ర్స్ వినిపించ‌వు. మామూలుగా ఈ త‌ర‌హా సినిమాల‌కు మాట‌లే ప్రాణం. డైలాగులు కూడా గొప్ప‌గా ఏమీ లేవు. సంగీతం విన‌సొంపుగా లేవు. పాట‌లు కూడా విన‌గానే ఎక్కేటట్టు అనిపించ‌లేదు.

విశ్లేష‌ణ‌:

అన్న‌ప్రాస‌న రోజే ఆవ‌కాయ‌ను పెట్టకూడ‌ద‌నుకున్నారేమో సుధీర్‌బాబు. అందుకే అంద‌రికీ ప‌రిచ‌య‌మైన సింపుల్ ల‌వ్‌స్టోరీని తొలి ప్రాజెక్ట్ గా ఎంపిక చేసుకున్నారు. కొన్ని భావోద్వేగాలు, కొన్ని జీవితాలు, కొన్ని న‌వ్వులు క‌ల‌బోతగా సినిమా చేయాల‌నుకున్నారు. ఆయ‌న‌తో పాటు న‌భా పాత్ర కూడా తెర‌మీద ఆక‌ట్టుకుంటుంది. బంధువులు, వారి అంచ‌నాలు, మాట‌లు వంటివాటిని చూపించే ప్ర‌య‌త్నం చేశారు. సినిమా రంగంలో నిర్మాతగా నిల‌వాల‌ని, క్వాలిటీకి సుధీర్‌బాబు ఇచ్చిన ప్రాముఖ్య‌త‌ను ఇట్టే గ‌మ‌నించ‌వ‌చ్చు. డైలాగుల మీద‌, సంగీతం మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బావుండేది. లొకేష‌న్లు బావున్నాయి. ఎడిటింగ్ కూడా ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ప‌ల్లెటూర్ల నుంచి ప‌ట్నాల‌కు కొలువుల కోసం ప‌రుగులు తీసే యువ‌త‌కు ఎక్క‌డో త‌మ జీవితాన్ని గుర్తుకు తెస్తుంది. కానీ అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు మాత్రం కాదు. మాస్‌ను ఎంత‌గా అల‌రిస్తుంద‌నేది మాత్రం వేచి చూడాల్సిన అంశ‌మే.

బాట‌మ్ లైన్‌:  అందరిని మెప్పించే నన్ను దోచుకుందువటే...

Read Nannu Dochukunduvate Movie Review in English

Rating : 3.0 / 5.0