close
Choose your channels

బిగ్‌బాస్ షోపై కేసు వేస్తా.. నాగార్జున క్షమాపణ చెప్పాలి: నారాయణ

Sunday, December 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ షోపై కేసు వేస్తా.. నాగార్జున క్షమాపణ చెప్పాలి: నారాయణ

టాలీవుడ్ సీనియర్ హీరో, బిగ్‌బాస్ వ్యాఖ్యత నాగార్జునపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తిరుపతిలో జరిగిన సీపీఐ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియా మీట్‌లో భాగంగా నారాయణ... బిగ్‌బాస్ షోపై స్పందించారు. బిగ్‌బాస్ ప్రారంభం రోజున జరిగిన విషయమై నారాయణ మరోమారు స్పందించారు. అసలు విషయంలోకి వెళితే బిగ్‌బాస్ ప్రారంభం రోజును ముగ్గురు ఫోటోలను అభికి నాగ్ చూపించి వారిలో ఎవరిని కిస్ చేస్తావు? ఎవరితో డేటింగ్ చేస్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావని ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపైనే నారాయణ నేడు మాట్లాడారు. తనకు నాగార్జున అంటే చాలా అభిమానమని కానీ ఆయన బిగ్‌బాస్ షోతో దరిద్రపు పనులు చేశారని వ్యాఖ్యానించారు.

బిగ్‌బాస్‌లో ముగ్గురు యువతుల ఫోటోలు పెట్టి ఒక యువకుడిని ఎవర్ని కిస్ చేస్తావు..? ఎవరితో డేటింగ్ చేస్తావు..? ఎవరిని పెళ్ళి చేసుకుంటావు..? అని ఓపెన్‌గా అడిగారని నారాయణ గుర్తు చేసుకున్నారు. సమాధానమిచ్చిన వ్యక్తి కూడా ఓపెన్‌గా మాట్లాడటం ఎంత అవమానకరమని వాపోయారు. ఆ ఫోటోల్లో ఆయన ఇంట్లోని మహిళా నటుల ఫోటోలు పెట్టి అడగ్గలడా..? అని ప్రశ్నించారు. పద్ధతిగా ఉన్న నాగార్జున ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్, కోర్టుకు వెళ్తే.. కనీసం కింది కోర్టులు కూడా కేసులు తీసుకోలేదన్నారు. జిల్లా కోర్టుల్లో కూడా కేసులు తీసుకోలేదని వెల్లడించారు. మనది పితృభూమి కాదు మాతృభూమి మహిళలకు ఇచ్చే స్థానం ఇదేనా..? అని ప్రశ్నించారు. మహిళలను ఇంత అన్యాయంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

త్వరలోనే బిగ్‌బాస్ ఈ షోపై హైకోర్టులో కేసు వేస్తానని... నాగార్జున సమాజానికి క్షమాపణ చెప్పేవరకూ ఎంత వరకైనా పోరాడుతానని నారాయణ తెలిపారు. ఇంకా నారాయణ మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఎంజీఆర్ తప్ప ఇంతవరకూ సెలబ్రెటీలెవరూ రాజకీయాల్లో సక్సెస్ కాలేదన్నారు. అంతేకాదు భవిష్యత్తులో కూడా సూపర్‌స్టార్ రజినీకాంత్‌, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సహా ఎవరూ సక్సెస్ కాలేరని భ్రమలు పెట్టుకోవద్దని నారాయణ జోస్యం చెప్పారు. కళామాతల్లి సేవ చేసుకుంటున్నారు కాబట్టి దానిని కొనసాగించాలని తెలిపారు. అయితే బిగ్‌బాస్ గురించి నారాయణ మాట్లాడటం ఇదేం కొత్త కాదు. ఈయన వ్యాఖ్యలపై ఇంతవరకూ షో యాజమాన్యం కానీ వ్యాఖ్యాత నాగార్జున కానీ స్పందించలేదు. మరి ఈసారైనా నాగార్జున స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.