Download App

Neevevaro Review

ఆది పినిశెట్టి... ప్రామిసింగ్ హీరో. ఒక‌వైపు న‌చ్చిన పాత్ర‌లు చేస్తూ, మ‌రో వైపు న‌చ్చిన సినిమాల్లో హీరోగా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. న‌టుడు అనిపించుకోవాల‌న్న‌దే త‌న ధ్యేయ‌మ‌ని ఇప్ప‌టికి చాలా సార్లు చెప్పారు. తాజాగా `నీవెవ‌రో` ఇంట‌ర్వ్యూల్లోనూ ఆయ‌న చెప్పింది అదే. ఆయ‌న చాన్నాళ్లు వెయిట్ చేసి ఎంపిక చేసుకున్న సినిమా `నీవెవ‌రో`. ఇందులో బ్లైండ్‌గానూ క‌నిపిస్తారు ఆది. తొలిసారి ఆయ‌న చెఫ్‌గా న‌టించిన `నీవెవ‌రో` ఎలా ఉంది? ప‌్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందా? ఆల‌స్య‌మెందుకు చ‌దివేయండి...

క‌థ‌:

క‌ల్యాణ్ (ఆది పినిశెట్టి) అంద‌గాడు. చిన్న‌ప్పుడే ఓ ప్ర‌మాదంలో క‌ళ్లు పోగొట్టుకుంటాడు. అయినా ఆత్మ స్థైర్యంతో అడుగులు వేసి ఓ హోట‌ల్ మొద‌లుపెట్టి బాగా లాభాలు ఆర్జిస్తాడు. మ‌రోవైపు ప‌లు మేగ‌జైన్ల క‌వ‌ర్ స్టోరీల్లోనూ అతనే ఉంటాడు. చిన్ననాటి స్నేహితురాలు అను (రితికా సింగ్‌) అత‌నితోనే మంచి జీవితాన్ని ఊహించుకుంటుంది. ఆమె అభిప్రాయానికి ఇరువైపుల త‌ల్లిదండ్రులు ఆమోద‌ముద్ర వేస్తారు. క‌ల్యాణ్‌తో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించినా అత‌ను పెద్ద‌గా ప‌ట్ట‌న‌ట్టు ఉంటాడు. అను త‌న మీద సింప‌తీతోనే పెళ్లికి అంగీక‌రించి ఉంటుంద‌ని అత‌ని న‌మ్మ‌కం. కానీ వాస్త‌వం వేరు. అను నిజంగానే అత‌న్ని ప్రేమిస్తుంది. ఆ విష‌యాన్ని అర్థం చేసుకోలేని అత‌ను అనూహ్యంగా వెన్నెల (తాప్సీ) ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ సంతోషంలో ఉండ‌గానే ప్ర‌మాదానికి గుర‌వుతాడు. అయితే అంత‌కు ముందే వెన్నెల‌కు ఓ మాట ఇస్తాడు. మాట నిల‌బెట్టుకోలేక‌పోయాన‌న్న బాధ‌లో ఉన్న అత‌నికి వెన్నెల తండ్రి ప‌రిచ‌య‌మ‌వుతాడు. అత‌ను కూడా అనూహ్యంగా ప్ర‌మాదానికి గురి కావ‌డం క‌ల్యాణ్‌ని కుంగ‌దీస్తుంది. అత‌ని ప్ర‌మాదాన్ని గురించి ఆరా తీస్తున్న క‌ల్యాణ్‌కి దిమ్మ‌తిరిగిపోయే నిజాలు తెలుస్తాయి. అవి ఏంటి?  వాటి వ‌ల్ల అత‌నికి క‌లిగిన క‌ష్ట‌న‌ష్టాలేంటి? అనేది ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్లు:

అంధుడిగా న‌టించే క్ర‌మంలో కూలింగ్ గ్లాస్‌లు పెట్టుకుని మేనేజ్ చేయొచ్చు. కానీ ఆది పినిశెట్టి ఇందులో ఆ ప‌ని చేయ‌లేదు. ప‌క్కాగా అంధుడిలాగానే న‌టించి మెప్పించాడు. స్నేహితుడి శ్రేయ‌స్సు కోరే అను పాత్ర‌లో రితికా ఒదిగిపోయింది. తాప్సీ మూడు గెట‌ప్స్ లోనూ మెప్పించింది. ఫైట్ సీక్వెన్స్ కూడా తాప్సీ నుంచి ఎవ‌రూ ఎక్స్ పెక్ట్ చేయ‌రు. స‌త్య‌కృష్ణ‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్ జంట‌, శివాజీరాజా, తుల‌సి జంట కూడా బావుంది. చొక్కారావు పాత్ర‌లో వెన్నెల‌కిశోర్‌, స‌ప్త‌గిరి కామెడీ కొంత‌వ‌ర‌కు రిలీఫ్ నిచ్చింది. హోట‌ల్ సెట్ బావుంది. అంధుడిగా ఆది చేసే ఫైట్ సినిమాకు ప్ల‌స్‌. అక్క‌డ‌క్క‌డా డైలాగులు మెప్పించాయి. కాస్ట్యూమ్స్ ప‌రంగానూ మంచి మార్కులే వేయాలి.

మైన‌స్ పాయింట్లు:

సినిమాలో మైన‌స్ అని ముఖ్యంగా చెప్పుకోద‌గ్గ శాఖ‌లు రెండే. ఒక‌టి క‌థ‌, క‌థ‌నం... ర‌చ‌న విభాగం. రెండు ఎడిటింగ్ విభాగం. మిగిలిన అన్ని పాత్ర‌లూ ప‌డ్డ క‌ష్టాన్ని ఈ రెండు శాఖ‌లు స‌రిగా క‌న్వే చేయ‌లేక‌పోయాయి. సినిమా తొలి భాగంలో చాలా బోరింగ్ స‌న్నివేశాలుంటాయి. ఏదో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టే ఉంటుంది కానీ, ఎక్క‌డా సినిమా వేగంగా క‌దిలిన‌ట్టుఅనిపించ‌దు. థ్రిల్ల‌ర్స్ కి కావాల్సిన వేగం ఇందులో చాలా త‌క్కువ‌గా ఉంటుంది. సెకండాఫ్ స్టార్టింగ్‌లోనూ ఇదే ప‌రిస్థితిని గ‌మ‌నించ‌వ‌చ్చు. హీరో ప్లాన్‌లు గీస్తుంటే ప‌క్క‌నే పోలీసులు చేత‌కానివాళ్ల‌లా ఉండ‌టం... గ‌మ‌నించవ‌చ్చు. చాలా సంద‌ర్భాల్లో ఇవ‌న్నీ వాస్త‌వానికి విరుద్ధంగా ఉన్న‌ట్టు అనిపిస్తాయి.

స‌మీక్ష‌:

ఈ త‌ర‌హా సినిమాల‌కు స్క్రీన్‌ప్లేలో వేగం చాలా కీల‌కం. ఈ సినిమాలో మిస్ అయిందే అదేనేమో అని అనిపిస్తుంది. పైగా రాక్ష‌సి పాట‌తో ముందుగానే క‌థ‌ను చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టే అయింది. తొలిస‌గంలో తాప్సీ, ఆది మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల్లో తాప్సీ న‌ట‌న ఆడియ‌న్స్ కి క్లూ ఇస్తూనే ఉంటుంది... ఆమే విల‌న్ అని. పైగా సెట్ వ‌ర్క్ ని ప్రొజెక్ట్ చేయ‌డానికి ద‌ర్శ‌కుడు ప‌డ్డ శ్ర‌మ‌, భావోద్వేగాల‌ను క్యాచ్ చేయ‌డంలో ప‌డ్డ‌ట్టు అనిపించ‌దు. క‌ల్యాణ్‌ని మ‌ర్చిపోయాన‌ని చెప్పిన అను... ఉన్న‌ప‌ళంగా అత‌నికి సాయం చేయ‌డానికి ఎందుకు ముందుకొస్తుందో అర్థం కాదు. త‌ర్వాత రాబోయే స‌న్నివేశాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఊహించే ప్రేక్ష‌కులకు థ్రిల్ క‌లిగించే అంశాలు త‌క్కువ‌గా ఉన్నాయి. రీరికార్డింగ్ అక్క‌డ‌క్క‌డా త‌మిళ సినిమాల‌ను త‌ల‌పిస్తుంది. ఓవ‌రాల్‌గా తెలుగువారికి ఈ సినిమా ఎంత న‌చ్చుతుంద‌నేది వెయిట్ చేసి చూడాలి.

బాట‌మ్ లైన్‌: `నీవెవ‌రో`... నెమ్మ‌దిగా సాగే సినిమా

Read Neevevaro Movie Review in English

Rating : 2.0 / 5.0