AP Cabinet : కేబినెట్ విస్తరణ దిశగా జగన్ అడుగులు.. ఆ మంత్రులు ఔట్, మంత్రివర్గంలోకి స్పీకర్ తమ్మినేని..?


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలమైన టీమ్‌ను సిద్ధం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడున్న మంత్రివర్గం వీక్‌గా వుందని ఆయనకు నివేదికలు కూడా అందాయి. పాలనతోపాటు విపక్షాలు చేసే విమర్శలను కూడా ఇప్పుడున్న మంత్రులు తిప్పికొట్టడం లేదని జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు మంత్రివర్గ సమావేశాల్లోనూ ఆయన ప్రస్తావించారు. దీనితో తోడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ మంత్రులు చురుగ్గా పాల్గొనడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు మంత్రులను తొలగించి.. వీరి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈసారి సామాజిక సమీకరణలను పక్కనబెట్టి.. సమర్ధతకే జగన్ పెద్ద పీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు ఎమ్మెల్సీలకు మంత్రివర్గంలో దక్కని అవకాశం:
ఇదిలావుండగా.. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసెంబ్లీలోని ఎమ్మెల్యేలకే కేబినెట్‌లో అవకాశం కల్పించారు. అయితే ఈసారి మాత్రం ఎమ్మెల్సీలకు ఆ ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. కేబినెట్ విస్తరణను దృష్టిలో వుంచుకునే బలమైన నేతలను ఆయన ఎమ్మెల్సీలుగా గెలిపించుకున్నారు. అందువల్ల ఈసారి ఎమ్మెల్సీలకే ఎక్కువ స్కోప్. కొత్తగా కేబినెట్‌లోని ముగ్గురు నుంచి నలుగురికి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించనున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీల్లో తనతో తొలి నుంచి నడుస్తున్న చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్, కాపు నేతల్లో బలమైన వ్యక్తిగా వున్న తోట త్రిమూర్తులకు అవకాశం కల్పిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.అలాగే మాజీ మంత్రి కొడాలి నానికి మరోసారి కేబినెట్ బెర్త్ లభించే అవకాశాలు వున్నాయి. కమ్మ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత మంత్రి మండలిలో ప్రాతినిథ్యం లేకపోవడంతో పాటు పార్టీకి బలమైన వాయిస్ వుండాలని జగన్ భావిస్తున్నారు. అందుకే నానికి ఛాన్స్ దక్కే విషయాలు మెండుగానే వున్నాయి.
శ్రీకాంత్ రెడ్డికి కూడా ఈసారి ఛాన్స్ :
అలాగే పార్టీ పెట్టిన నాటి నుంచి తన వెంటే వున్న కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ఈసారి మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్లుగా కథనాలు వస్తున్నాయ. ఇక మైనార్టీల విషయానికి వస్తే అంజాద్ భాషాను తప్పించి.. గుంటూరు జిల్లాకు చెందిన ముస్తాఫాకు అవకాశం కల్పిస్తారంటున్నారు. వీరితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి కూడా ఛాన్స్ దక్కుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేబినెట్‌లోకి స్పీకర్ తమ్మినేని:
ఇక అన్నింటికి మించి స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. గత కొంతకాలంగా తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని స్పీకర్.. జగన్‌ను కోరుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు ఉత్తరాంధ్రలో బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తమ్మినేనికి అవకాశం కల్పిస్తే పార్టీకి కూడా మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి స్పీకర్ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాడి వేడి మాటలతో ప్రత్యర్ధులను ఇరుకునపెట్టగల నేతగా, పాలనాపరంగానూ అనుభవం వుండటంతో తమ్మినేని సీతారామ్‌కు చివరి నిమిషంలో అవకాశం లభించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేబినెట్ కూర్పుపై జగన్ కసరత్తు మొదలేట్టేశారు. రెండ్రోజుల్లో కూడికలు తీసివేతలు చూసుకుని తుది జాబితా ప్రకటించే అవకాశం వుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.