ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ పునర్నియామకం..

  • IndiaGlitz, [Friday,July 31 2020]

ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. గురువారం అర్థరాత్రి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమిస్తూ జీవో జారీ చేసింది. కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేశారు. దీంతో ఆగ్రహించిన ఏపీ సర్కార్ ఎస్‌ఈసీ పదవీకాలాన్ని ‘సంస్కరణల’ పేరిట కుదిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. తక్షణమే నిమ్మగడ్డ పదవీకాలం ముగిసిందని ఆయనను తొలగించింది. అంతే కాదు.. మరో అడుగు ముందుకేసి ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించింది. దీంతో నిమ్మగడ్డ న్యాయపోరాటానికి దిగారు. ఆయన విషయంలో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.

అయినప్పటికీ తనను ఎస్ఈసీగా నియమించకపోవడంతో నిమ్మగడ్డ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను నిలిపివేయాలంటూ సుప్రీంను ప్రభుత్వం ఆశ్రయించినా అనుకూల ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలవడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. తాజాగా నిమ్మగడ్డ శుక్రవారం జడ్జిలను దూషించడానికి సంబంధించిన ఆధారాలను సుప్రీంకోర్టుకు అందించేందుకు సిద్ధమయ్యారు. దీంతో పరిస్థితి విషమించేలా ఉందని భావించిన ఏపీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎస్ఈసీగా పునర్నియమిస్తూ గవర్నర్ పేరిట నోటిఫికేషన్ జారీ అయింది. దీనిపై పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం అర్ధరాత్రి జీవో జారీ చేశారు.