సీతారాముల పెళ్ళికి ఎవరూ రావొద్దు : మంత్రి ప్రకటన

  • IndiaGlitz, [Tuesday,March 17 2020]

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ మొదలుకుని థియేటర్స్, జిమ్స్ ఇలా అన్నీ బంద్ చేసేసింది. ఈ క్రమంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో.. గుంపులుగా ఉండే ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకుంటోంది. తాజాగా భద్రాద్రి సీతారాముల కల్యాణానికి భక్తులను అనుమితించకూడదని నిర్ణయించింది. కరోనా ప్రభావం రోజు రోజుకూ ఎక్కువవుతున్న నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నామని.. స్వామివారి కల్యాణానికి ఎవరినీ అనుమతించట్లేదని.. కాబట్టి భక్తులెవరూ రావొద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. కాగా.. కేవలం అర్చకులు మాత్రమే శాస్ర్తోక్తంగా కల్యాణ క్రతువును నిర్వహించబోతున్నారు.

రామయ్య కల్యాణం భాధ్యతలను ఈసారి ప్రభుత్వ సలహాదారు రమణాచారికి అప్పగించడం జరిగింది. రామయ్య కల్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తీసుకుని వచ్చే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఈసారి ఎవరు తీసుకు వస్తారనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కల్యాణం టిక్కెట్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికే కొన్నవారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. కాగా.. ప్రభుత్వం నిర్ణయం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు. అయితే తప్పని పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు తీసుకంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.