Pawan Kalyan Varahi : జనసేనానికి బిగ్ రిలీఫ్... 'వారాహి' అంతా పర్ఫెక్ట్, వివాదానికి తెరదించిన కేసీఆర్ సర్కార్

జనసేన (Janasena) అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన రాష్ట్ర వ్యాప్త పర్యటనల కోసం వాహనాన్ని సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి వారాహి (Varahi) అని పేరు కూడా పెట్టారు. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని ప్రతిపక్ష వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. దానికి వారాహి కాకుండా నారాహి అని పేరు పెట్టుకోవాల్సిందని చురకలంటించారు. ఇంకొందరైతే.. ఈ వాహనానికి వినియోగించిన రంగును సామాన్యులు ఉపయోగించకూడదని, పవన్‌కి ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. దీనికి జనసేన పార్టీ నేతలు కూడా ధీటుగా బదులిచ్చారు. పవన్ జనంలోకి వెళితే తమ పరిస్ధితి ఏంటోనన్న భయంతోనే అధికార పార్టీ ఈ రకమైన వ్యాఖ్యల్ని చేస్తుందంటూ కౌంటరిచ్చారు.

వారాహి (Varahi) రంగుపై మాకు అభ్యంతరం లేదు :

ఇదిలావుండగా.. వారాహి వివాదానికి సంబంధించి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) క్లారిటీ ఇచ్చారు. వాహనాల రంగులకు కూడా కోడ్స్ వుంటాయని.. భారత సైన్యం ఉపయోగించే కలర్ కోడ్ 7B8165 కాగా... జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్తగా తయారు చేయించుకున్న వారాహి కలర్ కోడ్ 445c44 అని మంత్రి స్పష్టం చేశారు. ఈ రంగుపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని పువ్వాడ తెలిపారు.

అది అలీవ్ గ్రీన్ కాదు.. ఎమరాల్డ్ గ్రీన్:

డిసెంబర్ 9న హైదరాబాద్ టోలిచౌకి ఆర్టీవో కార్యాలయంలో వారాహి రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యిందని, దీనికి TS13EX8384 నెంబర్ కేటాయించామని, రవాణా శాఖ నుంచి వారాహి వాహనానికి పూర్తి అనుమతులు వున్నాయని పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం వారాహిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ వాహనం బాడీకి సంబంధించిన సర్టిఫికెట్‌ను పరిశీలించామని ఆయన పేర్కొన్నారు. వారాహి రంగు అలీవ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావడంతో వారాహికి సంబంధించి పవన్ కల్యాణ్‌కు బిగ్ రిలీఫ్ లభించినట్లయ్యింది.