close
Choose your channels

విశాఖలో ఎన్ఆర్ఐ కుటుంబం సజీవ దహనం..

Thursday, April 15, 2021 • తెలుగు Comments

ఫైనాన్షియల్‌గానే కాదు.. అన్ని విధాలుగా బాగుందనుకున్న ఎన్ఆర్ఐ కుటుంబం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే నలుగురూ సజీవ దహనమయ్యారు. అయితే స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్న పోలీసులకు అన్నీ అనుమానాలే. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని సమాచారం. విశాఖలోని మిథిలాపురి కాలనీలోని ఆదిత్య ఫార్చ్యూన్ టవర్స్‌లోని ఐదో అంతస్తులో ఈ దారుణం జరిగింది.

నాలుగేళ్ల క్రితం విశాఖకు..

ఎనిమిది నెలలుగా ఓ ఎన్ఆర్ఐ కుటుంబం ఆదిత్య ఫార్చ్యూన్ టవర్స్‌లో ఫ్లాట్ నంబర్ 505లో నివాసముంటోంది. బుధవారం అర్థరాత్రి దాటాక ఈ ఫ్లాట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగ, మంటలు కనిపించడంతో స్థానికులు గమనించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అప్పటికే ఫ్లాట్‌లోని బంగారు నాయుడు(50), అతని భార్య నిర్మల(46), కుమారులు దీపక్(22), కశ్యప్(19) మంటలకు సజీవ దహనమయ్యారు. వీరి స్వస్థలం విజయనగరం జిల్లా గంట్యాడ కాగా.. బెహరాన్‌లో స్థిరపడ్డారు. కాగా.. బంగారు నాయుడు నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలిసి విశాఖ వచ్చారు.

అన్నీ అనుమానాలే..

8 నెలలుగా ఆదిత్య ఫార్చ్యూన్ టవర్స్‌లో ఫ్లాట్‌ని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. అయితే వీరి మృతి కేసులో అన్నీ అనుమానాలే వ్యక్తమవుతుండటం గమనార్హం. నిజానికి ఈ ఘటన ఏ ప్రమాదవశాత్తో జరిగినట్టుగా అయితే అనిపించడం లేదు. నలుగురి మృతికి కారణం పాత కక్షలేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సజీవ దహనం కేసులో అంతా మిస్టరీగానే కనిపిస్తోంది. తాజాగా ఘటనాస్థలాన్ని నగర కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాకు పలు కీలక విషయాలను వెల్లడించారు.

సీపీ ఏం చెప్పారంటే..

505 ప్లాట్‌లో తెల్లవారుజామున ప్రమాదం జరిగిందని మనీష్ కుమార్ వెల్లడించారు. ఇంట్లో ఘర్షణ జరుగుతున్నట్లుగా చుట్టుపక్కల వాళ్ళు తెలిపారని.. సీసీ కెమెరా విజువల్స్ కూడా పరిశీలించామన్నారు. చివరిగా 505 ప్లాట్‌లోకి నిన్న రాత్రి 8:56 గంటలకు తండ్రి ఇంట్లోకి వెళ్ళారని తెలిపారు. కుటుంబ కలహాలు జరిగినట్లుగా తెలుస్తోందన్నారు. పెద్ద కుమారుడు దీపక్ మినహా ముగ్గురికి వంటిపై గాయాలున్నాయని సీపీ వెల్లడించారు. దీపక్ వారిపై దాడి చేసినట్లుగా తెలుస్తోందన్నారు. దీపక్ ఒక దగ్గర, మిగతా ముగ్గురు ఒక దగ్గర పడి ఉన్నారన్నారు. పూర్తి స్థాయిలో కారణం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీపక్ మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోందని సీపీ వెల్లడించారు. పెద్ద కుమారుడే కుటుంబ సభ్యులను హత్య చేసి తాను సజీవ దహనం చేసుకున్నట్లు అనుమానంగా ఉందని సీపీ వెల్లడించారు.

Get Breaking News Alerts From IndiaGlitz