కరోనాపై యుద్ధానికి యంగ్ టైగర్ 75 లక్షల విరాళం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో.. టాలీవుడ్ నటీనటులు పలు జాగ్రత్తలు, సలహాలు, సూచనలిస్తూ చైతన్య పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత పెద్ద మనసు చేసుకుని క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వాలకు తమ వంతుగా సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు, హీరోలు తమకు తోచినంత ఆర్థిక విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. అలా కరోనాను కట్టడి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

75 లక్షలు ఇస్తున్నా..

తాజాగా టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీర్ రూ.75ల‌క్షల విరాళాన్ని ప్రక‌టించారు. ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.25ల‌క్షలు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.50 ల‌క్షల విరాళం ఇస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరోవైపు.. రూ.25 ల‌క్షల‌ను క‌రోనా వైర‌స్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన రోజూవారీ పేద సినీ క‌ళాకారుల‌కు అంద‌జేస్తున్నట్లుగా ఎన్టీఆర్ ట్విట్టర్‌లో తెలిపారు.

ఇప్పటికే వీరంతా..

కాగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలకు పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. మరోవైపు.. రోజువారి, సినీ కార్మికులకు తమవంతుగా మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్ రాజశేఖర్, ప్రకాష్ రాజ్, అల్లరి నరేష్ తమవంతు సాయం చేశారు. సినిమా హీరోలు ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ధారపోసే దాంట్లో నుంచి ప్రతి రోజు మీతో పాటు రోజు వారి వేతనం కోసం పని చేస్తున్న సినిమా కార్మికులు గురించి కూడా కొంచెం ఆలోచించి వారికి కూడా అండగా ఉండాలని పలువురు పెద్దలు కోరుతున్నారు.