close
Choose your channels

తార‌క్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌.. జ‌నాలు మారుతారా?

Wednesday, February 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తార‌క్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌.. జ‌నాలు మారుతారా?

మ‌నం చేసే నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఎదుటివారు ప్రాణాలు కోల్పోతారు. అండ కోల్పోతారు. కాబ‌ట్టి మ‌న‌ల్ని మ‌నం స‌రిద్దిద్దుకోవాలి అని అంటున్నారు స్టార్ హీరో ఎన్టీఆర్ ఈరోజు సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక స‌మావేశానికి ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెట్రోలింగ్ వాహ‌నాలను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రోడ్డు ప్ర‌మాదాల‌పై ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు. నేను ఇక్కడకు యాక్టర్‌గా రాలేదని, నా కుటుంబంలో రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులను కోల్పోయిన వ్యక్తిగా వచ్చానని అన్నారు తారక్. ‘‘మేమైనా చిన్న‌పిల్ల‌లుగా ఉన్న‌ప్పుడు నిర్ల‌క్ష్యంగా వాహ‌నాల‌ను న‌డిపేవాళ్ల‌మేమో కానీ.. మా అన్న‌జానకిరామ్‌గారు ఎంతో జాగ్ర‌త్త‌ప‌రుడు. ఆయ‌న జాగ్ర‌త్త‌గా వెళుతున్న‌ప్ప‌టికీ నేష‌న‌ల్ హైవే పై ఓ ట్రాక్ట‌ర్ రాంగ్ రూట్‌లో రావ‌డం, అర్థాంత‌రంగా ఆ ట్రాక్ట‌ర్ న‌డిరోడ్డుపై ఆగిపోవ‌డంతో ఆయ‌న ప్ర‌మాదానికి గురై మ‌ర‌ణించ‌డం జ‌రిగింది. రెండో వ్య‌క్తి మా నాన్న‌గారు కీర్తిశేషులు నంద‌మూరి హ‌రికృష్ణ‌గారు. ఇందులో నేను కొత్త‌గా చెప్ప‌డానికి ఏం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు తెలిసిన విష‌య‌మే. ముప్పై మూడు వేల కిలోమీట‌ర్లు మా తాత‌గారిని ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌మంత‌టా ఒక ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా ప‌ర్య‌ట‌న‌ను పూర్తి చేసేలా చేసిన వ్య‌క్తి, ఆయ‌న ఎంతో జాగ్ర‌త్త‌గా ఉన్న‌ప్ప‌టికీ రోడ్డు ప్ర‌మాదానికి గురై మ‌మ్మ‌ల్ని వ‌దిలేసి వెళ్లిపోయారు.

మ‌నం జాగ్ర‌త్త‌గా ఉన్నా కూడా ప్ర‌మాదాలు పొంచి ఉంటాయి. కాబ‌ట్టి, ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు మీ వాహ‌నంలో వ‌చ్చిన‌ప్పుడు మీ కుటుంబ సభ్యుల్ని గుర్తు పెట్టుకోండి. మ‌న‌పై ఆధార‌ప‌డ్డ‌వారు ఎంతో మంది మ‌న‌కోసం ఎదురుచూస్తుంటారు. రోడ్డు ప్ర‌మాదాలు త‌గ్గాలంటే మ‌నం మారాలి .. రూల్స్‌ను ఫాలో చేయ‌డం వ‌ల్ల కానీ, క‌ఠిన‌మైన శిక్ష‌లు విధించ‌డం వ‌ల్ల కానీ, మ‌నం మారం. క‌రోనాలాంటి భ‌యంక‌ర‌మైన వ్యాధికి కూడా వ్యాక్సిన్ ఉంది కానీ, ఇలాంటి రోడ్డు ప్ర‌మాదాల‌కు గురైతే ఎలాంటి వ్యాక్సిన్స్ లేవు. మ‌నల్ని మ‌నం మార్చుకోవాలి. పౌరులంద‌రికీ నేను చెప్పేదొక‌టే, ద‌య‌చేసి మిమ్మ‌ల్ని మీరు మార్చుకోండి.

అన్నీ చోట్ల దేవుడు ఉండ‌లేక త‌ల్లిదండ్రుల‌ను, ఆ త‌ర్వాత గురువును సృష్టించాడు. అలాగే మ‌న‌కు మ‌న‌దేశాన్ని ప‌హ‌రా కాచే సైనికులను, మ‌న ఇంటి బ‌య‌ట కాప‌లా కాసే పోలీసుల‌న్ని సృష్టించాడు దేవుడు. విద్య నేర్పించే గురువుకు కూడా బ‌హుశా ఆ హ‌క్కు లేదేమో, పోలీసు చేతిలో ఓ లాఠీ పెట్టాడు. అది మ‌నల్ని కొట్టాడానికో, దండిచ‌డానికో కాదు.. మ‌న‌ల్ని స‌న్మార్గంలో న‌డ‌ప‌టానికని గుర్తించాలి. మ‌న బాగు కోసం పోలీసు డిపార్ట్‌మెంట్ ప‌డుతున్న క‌ష్టాన్ని గుర్తించండి. మ‌న త‌ల్లిదండ్రుల్ని ఎంత గౌర‌విస్తామో.. మ‌న పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను అలా గౌర‌వించ‌డం పౌరుడిగా మ‌న బాధ్య‌త‌, మ‌న ల‌క్ష్యం’’ అన్నారు హీరో తార‌క్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.