ఎట్టకేలకు 'నిశ్శబ్దం' విడుదలపై అధికారిక ప్రకటన

  • IndiaGlitz, [Friday,September 18 2020]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేటెస్ట్‌ మూవీ 'నిశ్శబ్దం' రిలీజ్‌కు సంబంధించి లేటెస్ట్‌ అధికారిక ప్రకటన వెలువడింది. గాంధీ జయంతి రోజున నిశ్శబ్దం సినిమాను అక్టోబర్‌ 2న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కోన ఫిలిం కార్పొరేషన్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కోనవెంకట్‌, విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలు ముందుగా కరోనా ప్రభావం లేకుంటే ఏప్రిల్ 2న సినిమాను విడుద‌ల చేద్దామనుకున్నారు. . కానీ క‌రోనా ఎఫెక్ట్ వల్ల థియేటర్స్ ఓపెన్ చేసే విషయంలో క్లారిటీ రాలేదు. దీంతో సినిమాను డిజిటల్‌ మాధ్యమం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నారు. ఇన్నాళ్లుగా సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో నిర్మాతలు కోన వెంకట్, విశ్వప్రసాద్‌ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేశారు. తెలుగులో 'నిశ్శబ్దం', తమిళ, మలయాళ భాషల్లో 'సైలెన్స్‌' పేరుతో సినిమా అమెజాన్‌లో విడుదల కానుంది.

హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నిశ్శ‌బ్దం చిత్రంలో అనుష్క‌తో పాటు మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజు, అండ్రూ హడ్సన్‌ త‌దిత‌రులు న‌టించారు. దివ్యాంగురాలి సాక్షి పాత్రలో అనుష్క నటించారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. గత ఏడాది అక్టోబర్‌ 2న విడుదలైన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో అనుష్క నటించారు. ఇప్పుడు మరోసారి అనుష్క సినిమా అక్టోబర్‌ 2నే విడుదల కానుండటం యాదృచ్చికం. 'భాగమతి' తర్వాత అనుష్క నటించిన చిత్రమిదే. హాలీవుడ్‌ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు.