Download App

Operation Gold Fish Review

దేశ‌భ‌క్తిని ఆవిష్క‌రించే చిత్రాలకు ఆద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ చిత్రాల‌ను తెర‌కెక్కించే రీతిలో తెర‌కెక్కించాల్సి ఉంటుంది. లేకుంటే ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్క‌దు. జ‌యాప‌జ‌యాల‌కు సంబంధం లేకుండా దేశ‌భ‌క్తి చిత్రాలు ఎప్పుడూ వ‌స్తుంటాయి. అయితే రీసెంట్ టైమ్‌లో కాశ్మీరీల‌కు సంబంధించి 370 ఆర్టిక‌ల్‌ను మ‌న ప్ర‌భుత్వం తీసి వేసింది. ఇలాంటి చ‌ర్చ‌నీయాంశ‌మైన ఆర్టిక‌ల్‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన చిత్ర‌మే `ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌`. మంచి హిట్ కోసం వేచి చూస్తున్న ఆది సాయికుమార్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌మాండోగా న‌టించారు. మ‌రి ఈ సినిమా ఆయ‌న‌కు స‌క్సెస్‌ను అందించిందా?  లేదా?  అనే విష‌యాన్ని తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ‌:

1990 ప్రాంతంలో కాశ్మీర్‌ను విడిచి పెట్టి వెళ్లిపోవాలంటూ టెర్ర‌రిస్ట్ ఘాజీ బాబా(అబ్బూరి ర‌వి) క‌శ్మీరీ పండిట్స్‌ను ఊచ‌కోత కోస్తాడు. అలా ఘాజీ బాబా చేతిలో అర్జున్ పండిట్‌(ఆది సాయికుమార్‌) త‌న త‌ల్లిదండ్రుల‌ను కోల్పోతాడు. దాంతో ఘాజీ బాబా మీద కోపం అర్జున్ ఎన్‌.ఎస్‌.జి కమాండోగా ఎదుగుతాడు. ఓ టెర్ర‌రిస్ట్ యాక్టివిటీ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన ఘాజీ బాబాను అర్జును్ ప‌ట్టుకుంటాడు. కోర్టు అత‌నికి ఉరి శిక్ష వేస్తుంది. ఘాజీ బాబాను విడిపించ‌డానికి అత‌ని ప్ర‌ధాన అనుచ‌రుడు ఫ‌రూక్‌(మ‌నోజ్ నందం) ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తాడు. అందుకోసం కేంద్ర విదేశాంగ మంత్రి కుమార్తెను కిడ్నాప్ చేయాల‌నుకుంటారు టెర్ర‌రిస్టులు. దాంతో అర్జున్ ఆ అమ్మాయిని టెర్ర‌రిస్టుల బారి నుండి ఎలా కాపాడుతాడు?  ఎలా ఘాజీ బాబాను అంతం చేస్తాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే  సినిమా చూడాల్సిందే..

విశ్లేష‌ణ‌:

ద‌ర్శ‌కుడు సాయికిర‌ణ్ అడివి దేశంలో జ‌రుగుతున్న ఓ కీల‌క స‌మ‌స్య‌ను చాలా సినిమాగా తెర‌కెక్కించాల‌నుకోవ‌డ‌మే పెద్ద సాహసం. కాశ్మీర్ స‌మస్య‌ను.. అందులో కాశ్మీరీ పండిట్స్, ఉగ్ర‌వాద స‌మ‌స్య‌కు ముడిపెడుతూ ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్ క‌థ‌ను రాసుకున్నారీయ‌న‌. టెర్ర‌రిస్టులు, ఎన్‌.ఎస్‌.జి క‌మెండోలు మ‌ధ్య పోరాటాలు ఎలా జ‌రుగుతాయ‌నేది కూడా ఈ సినిమాలో చ‌క్క‌గా చిత్రీక‌రించారు. సినిమాలో ఆది సాయికుమార్ ఎన్‌.ఎస్‌.జి కమెండోగా సీరియ‌స్ పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. ఈ పాత్ర‌కు అంత‌కు మించి ఏమీ చేయ‌లేం కూడా. ఇక మాట‌ల ర‌చ‌యిత‌గా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు తెలిసిన అబ్బూరి ర‌వి.. న‌టుడిగా ప‌రిచ‌యం అవ‌డం గొప్ప ప‌రిణామంగా చెప్పుకోవ‌చ్చు. నిజానికి ఈయ‌న ఘాజీ బాబా అనే పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయారు. మినిష్ట‌ర్ పాత్ర‌లో రావు ర‌మేశ్‌, అనీష్ కురువిల్లా, సాషా చ‌త్రి, కృష్ణుడు, పార్వ‌తీశం, నిత్యాన‌రేశ్ ఇలా న‌టీన‌టులంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. ఇక సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్ర‌ఫీ బావుంది. కాశ్మీర్ అందాల‌నే కాదు.. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కూడా కెమెరామెన్ జైపాల్ రెడ్డి చ‌క్క‌గా తెర‌కెక్కించారు. సంగీతం బావుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సాంగ్ బావుంది. అయితే సినిమాలో సస్పెన్స్ కోసం రాసుకున్న లాజిక్ లెస్ చీటింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమా ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ కాదు. ఓ ర‌కంగా కాశ్మీర్ స‌మ‌స్య చుట్టూ తిరిగే సీరియ‌స్ క‌థను కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌కు లింక్ పెట్ట‌డంతో సాగ‌దీత‌గా అనిపిస్తుంది. సినిమాలో చేసిన కామెడీ ఎక్క‌డా వ‌ర్కవుట్ కాలేదు. కొన్ని అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలుగా అనిపిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఫిప్ ఫైట్‌లాంటిది. మేకింగ్ బావుంది.

బోట‌మ్ లైన్‌: ఓకే అనిపించిన ఆప‌రేష‌న్

Read Operation Gold Fish Movie Review in English

Rating : 2.8 / 5.0