close
Choose your channels

రేవంత్‌ను కాంగ్రెస్‌ నుంచి తరిమేయాలనుకుంటున్నారా..!?

Saturday, March 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రేవంత్‌ను కాంగ్రెస్‌ నుంచి తరిమేయాలనుకుంటున్నారా..!?

తెలంగాణ కీలకనేత, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి తరిమేయడానికి పక్కా ప్లాన్‌తో ఆ పార్టీ నేతలు ముందుకెళ్తున్నారా..? ఆయనకు పీసీసీ చీఫ్ పదవి వస్తుందని ముందుగానే భావించి ఆయన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారా..? పార్టీ నుంచి తరిమేయాలనే కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారా..? అంటే తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమని తెలుస్తోంది. ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..? రేవంత్‌పై అందరూ ఎందుకింతలా కక్ష కట్టారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

సపోర్ట్ చేయాల్సింది పోయి..
ఎవరేమనుకున్నా.. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా రేవంత్ రెడ్డి కీలకనేతే. తెలంగాణ టీడీపీ కనుమరుగవ్వడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి వరకూ టీడీపీలో ఓ వెలుగు వెలిగిన ఆయన.. కాంగ్రెస్‌లోనూ తనదైన శైలిలో దూసుకెళ్లారు. అయితే.. ఆ దూకుడును చూసిన అధిష్టానం పీసీసీ పదవి ఇస్తే పార్టీ బలోపేతం అవ్వడమే కాకుండా అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. ఈ క్రమంలో ఆయనకు ఆ పదవి రాకుండా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మోకాలడ్డేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ఆయనపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడం.. ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు గుప్పించడం.. మరీ ముఖ్యంగా ఆయన కేసులు ఎదుర్కొంటున్నా.. ప్రభుత్వం నుంచి ముప్పు ఉందన్నప్పుడు కూడా రేవంత్‌కు ఏ మాత్రం సపోర్టు ఇవ్వకుండా.. ఆయన్నే తప్పుబట్టడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందో అనే విషయం స్పష్టం అర్ధం చేసుకోవచ్చు.

ప్రెస్ మీట్ పెట్టి మరీ...!
మరీ ముఖ్యంగా ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ కీలకనేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. రేవంత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ విషయమై ప్రెస్‌మీట్ పెట్టి మరీ దుమ్మెత్తిపోశారు. ప్రతిపక్ష పార్టీ అనేది.. ప్రభుత్వం తప్పొప్పులను ఎత్తి చూపాల్సింది పోయి.. రోజూ ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం గమనార్హం. అయితే ఇంత జరుగుతున్నా రేవంత్ మాత్రం నోరు మెదపట్లేదు.

చిల్లర పనేంటి రేవంత్..!
‘రేవంత్‌రెడ్డి మెచ్యూర్డ్‌ పొలిటిషియన్‌గా ప్రవర్తించాలి. ఎంపీ స్థాయి వ్యక్తి డ్రోన్‌ కెమెరా పెట్టి ఫాంహౌస్‌ చిత్రాలు తీయడం చిల్లర పని. కారెక్కి షో చేయడం చిన్న పిల్లల చేష్టలుగా ఉన్నాయి. రేవంత్‌రెడ్డి తనను తాను హీరోను అనుకుంటే ఎలా?. గోపన్‌పల్లి భూముల వ్యవహారం బయటపడగానే రేవంత్‌కి 111 జీవో గుర్తొచ్చిందా?. అక్కడ ఎప్పటి నుంచో అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఇలాంటి విషయాల వల్ల పార్టీకి ఉపయోగం ఉండదు. రేవంత్‌రెడ్డి టీషర్ట్‌ వేసుకొని చలో ప్రగతిభవన్‌కు వెళ్లి చిల్లరగా వ్యవహరించారు. ఒక్కడే వెళ్లడం కాదు... చలో కార్యక్రమం అంటే లక్షమందితో వెళ్లాలి’ అని కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

నువ్వేం తీస్‌మార్ కాదు రేవంత్..!?
ఇదిలా ఉంటే.. ఈ మధ్యే జగ్గారెడ్డి.. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రేవంత్ తీస్‌మారేం కాదు. 111 జీవో విషయంలో రేవంత్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశారు. శ్రీధర్ బాబు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ రేవంత్ రెడ్డి అనుచరులు ఫేస్ బుక్‌లో దుష్ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారు. దీన్ని సహించేది లేదు. రేవంత్ కాబోయే సీఎం అని.. పీసీసీ అధ్యక్షుడు అంటూ ఊదరగొడుతున్నారు. రేవంత్ రెడ్డి అంత తీస్‌మార్ ఖాన్ కాదు. అంత తీస్ మార్ ఖాన్ అయితే.. టీడీపీలో ఉండే ఎందుకు చేసుకోలేడు?. నువ్వు మగాడివే కదా.. టీడీపీలో ఉండి మగాడివి అని ఎందుకు అనిపించుకోలేదు? నిన్ను అడిగేవారు లేక ఇదంతా చేస్తున్నారా? ఎలా కనపడుతున్నాం’ అని రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

ఏం జరుగుతోంది..!?
మొత్తానికి చూస్తే.. రేవంత్ ఎదుగుదలను ఎవరో కాదు.. సొంత పార్టీ నేతలే ఇలా తొక్కేయడం.. విమర్శలు గుప్పించడం.. చూస్తుంటే కాంగ్రెస్‌లో రేవంత్ మనుగడ కష్టమేనని స్పష్టంగా అర్థం అవుతోంది. రేవంత్ తప్పు చేశాడా..? లేదా.? అనేవిషయాలు నిశితంగా తెలుసుకొని మద్దతు పలకాల్సింది పోయి ఇలా చేస్తుండటం ఎంతవరకు సమంజసం..? ఇంత జరుగుతున్నా ఢిల్లీ పెద్దలు ఏం చేస్తున్నారు..? అసలు రేవంత్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు..? పీసీసీ పదవి వచ్చాకే అసలు విషయాలన్నీ చూద్దామని మిన్నకుండిపోతున్నారా..? లేకుంటే పక్కా ప్లాన్‌తో రేవంత్ కూడా ముందుకెళ్తున్నారా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.