close
Choose your channels

ఏపీలో ఏ పార్టీ గెలిచినా జంపింగ్‌లే.. జంపింగ్‌లు!!

Thursday, May 23, 2019 • తెలుగు Comments

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై నరాల తెగే ఉత్కంఠ నెలకొంది. లెక్కింపు ఎప్పుడు ప్రారంభం అవుతుందో..? ఏ పార్టీ గెలుస్తుందో..? అని అటు నేతల్లో.. ఇటు అభిమానులు, కార్యకర్తల్లో టెన్షన్.. టెన్షన్. ఇప్పటికే మా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డే సీఎం కాబోతున్నారంటూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టేశారు. అంతేకాదు పెద్ద ఎత్తున పటాసులు సైతం చేయించి సిద్ధం చేసుకున్నారు.

మరోవైపు టీడీపీ నేతలు.. కచ్చితంగా తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులు మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెడతాయని తొడగొట్టి మరీ చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీలో గెలిచేశాం.. ఇక ఢిల్లీని ఏలాల్సిందే అన్నట్లుగా చంద్రబాబు హస్తిన చుట్టూ కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ.. ఎన్డీఏను దెబ్బతీయాలని భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎవరి ధీమాలో వాళ్లున్నారు.. సరే అయితే రేపొద్దున ఏపీ ఫలితాలు తాము అనుకున్నట్లుగా కాకుండా కాస్త డిఫరెంట్‌గా వస్తే పరిస్థితేంటి..? నేతలు, అభిమానులు తట్టుకోగలరా అన్నది పైనున్న దేవుడికెరుక. 

ఇక అసలు విషయానికొస్తే.. ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలు.. 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 88 సీట్లు. అయితే రేపు ఫలితాల తర్వాత ఏ పార్టీ గెలిచినా గట్టిగానే జంపింగ్‌లు జరుగుతాయని తెలుస్తోంది. ఇప్పటికే అప్రమత్తమైన పార్టీ అధినేతలు అందర్నీ తమ కంట్రోల్‌లో పెట్టుకున్నారు. అంతేకాదు వారి మొబైల్ ఫోన్స్ సైతం ట్యాప్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారి అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు నేతలు జంప్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

కాగా గత ఎన్నికల్లో కూడా సుమారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రమాణ స్వీకారం చేసేలోపే ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో మారొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇది మళ్లీ పునారవృతం కాకుండా ఉండాలని వైఎస్ జగన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు రేపు ఎన్నికల్లో ఓడిన పార్టీకి దాదాపు అడ్రస్ గల్లంతయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సో.. మరికొన్ని గంటల్లో ఏ పార్టీ అధినేత సీఎంగా ఉంటారో.. ఎవరు ప్రతిపక్షనేతగా మిగిలిపోతారో తేలిపోనుంది.

Get Breaking News Alerts From IndiaGlitz