close
Choose your channels

జగన్‌కూ టైమ్ ఇస్తాం.. ప్రజావేదికపై పవన్ రియాక్షన్

Monday, June 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జగన్‌కూ టైమ్ ఇస్తాం.. ప్రజావేదికపై పవన్ రియాక్షన్

ప్రజావేదికను ఎల్లుండి కూల్చేస్తామని.. అక్రమ కట్టడాల కూల్చివేత ఇక్కడ్నుంచే ప్రారంభించబోతున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. అక్రమకట్టడాలైతే ప్రజావేదికతోపాటు అన్నీ కూల్చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఫిరాయింపులపై..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు జనసేన, టీడీపీ పార్టీల నుంచి నేతలు జంపింగ్‌లు షురూ చేశారు. అయితే ఈ వ్యవహారంపై పవన్ మాట్లాడుతూ.. స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు నేతలు పార్టీలు మారుతున్నారని.. అయితే జనసేన నుంచి ఎవరూ వెళ్లడం లేదన్నారు. ఫిరాయింపులకు తాను వ్యతిరేకమన్న పవన్.. జనసేనలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామన్నారు. జనం అజెండా ఏంటి..? వారు ఏం కోరుకుంటున్నారు..? అనే దానిపై కొన్ని నెలల్లో ప్రజా అజెండా ఖరారు చేస్తామన్నారు. అంతటితో ఆగని ఆయన.. తాను రాజకీయాల్లో కొనసాగనని వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు. రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతానని.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని పవన్ స్పష్టం చేశారు.

వైసీపీకీ టైమ్ ఇస్తాం..!

టీడీపీ ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్టే.. వైసీపీకీ ఇస్తామన్నారు పవన్. వైసీపీ విధానాలు పూర్తిగా తెలిశాకే స్పందిస్తామని.. తాను ఓడిన తర్వాత కూడా జనం ఆపి తమ సమస్యలు చెప్పడం చూస్తే.. తనపై ఎలాంటి ఆశలు పెట్టుకున్నారో అర్ధమైందని ఒకింత భావోద్వేగాని లోనయ్యారు. మంచి చేస్తే కచ్చితంగా హర్షిస్తామని.. ఏపీ ఆస్తులు తెలంగాణకు ఎలా ఇచ్చారని వాటిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు.

నేరుగా కలవలేకపోతున్నారు అందుకే..!

కాగా... ప్రస్తుతం 18 నుంచి 20 కమిటీలు వేస్తున్నామని.. ఇందులో పార్టీ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే వారికి ప్రాధాన్యతనిస్తామని పవన్ స్పష్టం చేశారు. పార్టీ నేతల నుంచి మరిన్ని సలహాలు, సూచనలు తీసుకుంటామని తమను నమ్ముకున్న వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. తనకు ఉన్న ప్రజాదరణకు లక్షల మంది ప్రజలు తనను నేరుగా కలవాలని అనుకుంటారని.. ప్రతి ఒక్కరినీ కలవడం తనకు వీలు కాదు కనుక రాష్ట్ర కమిటీల ఏర్పాటు ద్వారా వారి సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు పవన్ చెప్పుకొచ్చారు. రాబోయే నెల రోజుల్లో జనసేన రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించబోతున్నామన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.