close
Choose your channels

కార్మికుల కోసం పవన్ కల్యాణ్ భారీ పాదయాత్ర

Monday, October 21, 2019 • తెలుగు Comments

కార్మికుల కోసం పవన్ కల్యాణ్ భారీ పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగం కుదేలై ఉపాధి లేక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న కార్మికుల బాధలను అందరికీ తెలియచేసి, కార్మికులకు అండగా నిలిచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ పాదయాత్ర (లాంగ్ మార్చ్) చేపట్టాలని నిర్ణయించారు. నవంబర్ 3 వలేదా 4 వ తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ పాదయాత్ర మొదలవుతుంది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కమిటీ సభ్యులు తోట చంద్రశేఖర్, రాపాక వరప్రసాద్ (శాసనసభ్యులు), కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, పసుపులేటి హరిప్రసాద్, సిహెచ్. మనుక్రాంత్ రెడ్డి, ఎ.భరత్ భూషణ్, బి.నాయకర్ సమావేశంలో పాల్గొన్నారు.

యువనాయకత్వాన్ని తీర్చిదిద్ధేందుకు..!

సమావేశం అనంతరం పార్టీ పొలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలను నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. యువనాయకత్వాన్ని తీర్చిదిద్ధేందుకు పార్టీపరంగా నిరంతర కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా క్షేత్ర స్థాయి నుంచి ప్రణాళికలు అమలు చేయాలని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన హక్కులు, విధులు, బాధ్యతలను యువతరానికి తెలియచేయడం ద్వారా దేశసమగ్రతను కాపాడగలమన్నారు. అలాగే కార్తీక మాసంలో పర్యావరణ పరిరక్షణ కోసం పార్టీపరంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

కార్మికుల ఆవేదన అందరికీ తెలియాలి

‘ఇసుక సరఫరా ఇప్పటికీ సక్రమంగా లేకపోవడంతో 35 లక్షల మంది నెలల తరబడి ఉపాధికి దూరమైపోయి తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర పరిస్థితులు చూస్తే ప్రభుత్వం ఈ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమైంది. అక్కడకు వచ్చిన భవన నిర్మాణ కార్మికులు ఉపాధి దొరకడం లేదని ఎంతో ఆవేదన చెందారు. ఈ రంగం చుట్టూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో వ్యాపారాలు నడుస్తుంటాయి. వాటిలో ఎంతోమందికి ఉపాధి ఉంది. వీళ్లంతా రోడ్డునపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల ఆవేదన అందరికీ తెలియాలి. అందుకు అనుగుణంగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేద్దాం. ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ మంది కూలీలు భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నారు. మన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంలో చలనం రావాలి’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని.. యువ నాయకత్వాన్ని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ ఆదేశించారు. పంచాయతీ, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని తలదన్నిన ఏపీ ప్రభుత్వం

అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ చర్యల వాళ్ళ సుమారు రెండున్నర లక్షల మంది రోడ్డునపడే పరిస్థితి నెలకొందని సభ్యులు ప్రస్తావించారు. "48 వేలమంది ఆర్టీసీ కార్మికులను తొలగించాలని తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాన్ని తలదన్నేలా అంతకు అయిదింతలు.. 2.5లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించేలా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద"ని పవన్ కల్యాణ్ విమర్శించారు.

Get Breaking News Alerts From IndiaGlitz