కెప్టెన్ విజయ్‌కాంత్ పెద్ద మనసు.. పవన్ అభినందన
కోలీవుడ్ సూపర్ స్టార్ ఓ వెలుగు వెలిగిన నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కష్టకాలంలో తనకు తోచినంత సాయం చేసేందుకు ఆయన ముందుకు వస్తుంటారు. ఇప్పుడు కరోనా ఆపత్కాలం కావడంతో దీనివల్ల చనిపోయిన వారికి తనకు సంబంధించిన సొంత కాలేజీ స్థలాన్ని ఖనానికి ఇస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఈయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణముంది. కరోనా వల్ల చనిపోయిన వారిని ఖననం చేసేందుకు కానీ.. ఫలానా చోట ఖననం చేసుకోవాలన్నా గ్రామస్థులు ఒప్పుకోవట్లేదు.. ఈ మధ్య కరోనాపై పోరాడిన డాక్టర్ అదే కరోనాతో చనిపోతే గ్రామస్థులు అడ్డుకుని అంబులెన్స్‌పై దాడి కూడా చేశారు. ఈ తరుణంలో విజయ్‌కాంత్ తన ఆండాళ్ అళగర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఖననం చేసుకోవచ్చని.. ఎవరూ అధైర్య పడనక్కర్లేదని పెద్దమనసుతో కెప్టెన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన పెద్ద మనసు చాటుకోవడంతో కోలీవుడ్ మొదలుకుని.. టాలీవుడ్ వరకూ కెప్టెన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మెచ్చుకున్న పవన్..
తాజాగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించి.. ట్విట్టర్ వేదికగా కెప్టెన్‌ను అభినందించారు. విజయ్ కాంత్ గారూ.. మీరు చేసిన మంచిపనిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని కొనియాడారు. పవన్ చేసిన ఈ ట్వీట్‌కు కెప్టెన్ నుంచి ఇంకా రిప్లయ్ రాలేదు. మరోవైపు ఈ ట్వీట్‌ను జనసేన, డీఎండీకే అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తూ షేర్ చేస్తున్నారు. కాగా.. కరోనా పోరులో భాగంగా సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులకు తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తూ పెద్ద మనసు చాటుకున్నారు.