'చంద్రబాబు చేస్తున్న పనికి భయమేసింది.. ఎందుకింత కక్ష జగన్..'

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని.. అమరావతి తరలిస్తారన్న ప్రకటన అనంతరం రైతులు, ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజధానికి భూములిస్తున్న రైతన్నలకు మద్దతుగా, అండగా నిలిచేందుకు పవన్ ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రైతులకు మద్దతు తెలిపిన అనంతరం మీడియాతో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాడు సీఎంగా చంద్రబాబు.. రాజధానికోసం 33వేల ఎకరాలు సేకరించినప్పుడు భయమేసిందన్నారు. ఒక నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మించలేరని.. ఒక నగర నిర్మాణం కొన్ని దశాబ్దాలు పడుతుందన్నారు. పిల్లల భవిష్యత్‌ను ఫణంగా పెట్టి రైతులు భూమిలిచ్చారని.. చంద్రబాబుపై, ఓ వ్యక్తిపై భరోసాతో రైతులు భూములివ్వలేదని చెప్పుకొచ్చారు.

జగన్ ఎందుకు చెప్పలేదు!

‘ప్రభుత్వంపై భరోసాతో రైతులు భూములిచ్చారు. ప్రభుత్వమే మాట తప్పడం దారుణం. అమరావతి రాజధానికి అసెంబ్లీలో జగన్‌ ఆమోదం తెలిపారు.రాజధాని రైతులకు జనసేన అండగా ఉంటుంది. భూములమ్మితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. రాష్ట్రంలో ప్రజలు వైసీపీకి 151 సీట్లిచ్చింది.. అస్థిరత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాదు. అమరావతికి వ్యతిరేకమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ ఎందుకు చెప్పలేదు. రాజధాని విషయంలో జగన్‌ ధర్మం తప్పారు. ధర్మం తప్పిన వ్యక్తిని ఈ నేల క్షమించదు’ అని పవన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎందుకింత కక్ష జగన్!?

‘అమరావతిపై జగన్‌కు ఇంత కక్ష ఎందుకు?. అమరావతిలో అవకతవకలు జరిగితే దోషులను శిక్షించండి. కొందరు వ్యక్తులపై కోపం... ప్రజలందరిపై చూపించొద్దు. రైతులకు న్యాయం జరిగేవరకు జనసేన అండగా ఉంటుంది. ఓట్ల గురించి కాదు.. మార్పు గురించే నా ప్రయత్నం. ప్రజలను మభ్యపెట్టి ఓట్లేయించుకునే వాడిని కాదు. భూమిని నమ్ముకున్న రైతులకు అన్యాయం జరగొద్దు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై వైసీపీ స్పష్టమైన ప్రకటన చేయాలి. అమరావతి రైతులకు భరోసా కల్పించకుండా ముందుకెళ్లొద్దు. హైకోర్టు విషయంలో సీమ ప్రజలను మభ్యపెడుతున్నారు. అమరావతిని ఎడారి అనడం ఆందోళనకారులను పెయిడ్‌ ఆర్టిస్టులనడం క్షమించరానిది. రైతుల ఆశయాలను కాపాడటం జనసేన ప్రధాన కర్తవ్యం. 151 సీట్లు పర్మినెంట్‌ కాదు.. ఏ క్షణమైనా కూలిపోవచ్చు’ అని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు.