‘రాజధాని విషయంలో పెద్దన్న రంగంలోకి దిగాల్సిందే..’

  • IndiaGlitz, [Friday,January 10 2020]

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపు విషయమై.. అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు, పలు ప్రజా సంఘాల నేతలు రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే రాజధాని రైతులకు మద్దతుగా నిలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అంతకుముందు పార్టీ నేతలైన నాదెండ్ల మనోహర్, మెగా బ్రదర్ నాగబాబు ఇద్దరూ వెళ్లి రైతులకు భరోసా ఇచ్చారు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ ఈ తరలింపు విషయమై మీడియాతో మాట్లాడేతూ ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘పెద్దన్న’ దిగాల్సిందే..!
రాజధాని విషయంలో ఇక ఎవరూ చేసేదేమీ లేదని పెద్దన్న రంగంలోకి దిగాల్సిందేనని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఇంతకీ పెద్దన్న అంటే మెగాస్టార్ చిరంజీవి అనుకుంటున్నారేమో.. కాదండోయ్ బాబూ.. కేంద్ర ప్రభుత్వం.!. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ చెప్పుకొచ్చారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాజధాని బాధ్యత కేంద్రంపై ఉందని.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన రాజధాని విషయంలో తదుపరి నిర్ణయం తీసుకోవాలని పవన్ కోరారు. శుక్రవారం నాడు గుంటూరు జిల్లా నేతలతో సమావేశం అవ్వడంతో.. జనసేన కార్యాలయానికి అమరావతి రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సుమారు అరగంటకు పైగా రైతులు, నేతలతో జనసేనాని మాట్లాడారు. రాజధానిపై కాంగ్రెస్‌, బీజేపీ తమ వైఖరి చెప్పాలని.. విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత ఉందన్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు.

మరోసారి ఇలా..!
మరీ ముఖ్యంగా ఈ రాజధాని విషయమై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. భూములిచ్చిన రైతులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని.. రైతన్నలకు అన్యాయం జరగకూడదని చూడాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని జనసేనాని కోరారు. మొత్తానికి చూస్తే పవన్ రంగంలోకి దిగారు గనుక కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆయన వీరాభిమానులు, కార్యకర్తలు భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. అమరావతి రైతుల కోసం జనసేన మరోసారి నిరసన కవాతు చేపట్టాలని యోచిస్తున్నారని టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకే వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.