close
Choose your channels

చిల్లర రాజకీయాలకు ఆపి.. క్షమాపణ చెప్పండి : పవన్

Wednesday, April 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిల్లర రాజకీయాలకు ఆపి.. క్షమాపణ చెప్పండి : పవన్

రోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. గత మూడ్రోజులుగా ఈ ఎపిసోడ్ జరుగుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు.. విమర్శలు, ప్రతి విమర్శలతో నే సరిపోతోంది. మరోవైపు..కన్నాపై వైసీపీ నేతలందరూ వరుసగా మీడియా మీట్‌లు పెట్టి ఎవరికీ తెలియని రహస్యాలను బయటపెడుతున్నారు. ఈ పరిణామాలపై గత ఏడాది బీజేపీతో చేతులు కలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కరోనా నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలను అందించాల్సిన తరుణంలో.. తప్పులను వేలెత్తి చూపుతున్న వారిపై వైసీపీ పెద్దలు బురద చల్లే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. కన్నాపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయని అన్నారు.

దూరంగా ఉందాం!

కన్నాపై జరుగుతున్న దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన రీతిలో, ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడగాల్సిన స్థాయిలో ఉందని చెప్పారు. ‘ఈ ఆపత్కాల సమయంలో జనసేన పార్టీ అందరినీ కోరుతున్నది ఒక్కటే... కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదాం. చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందాం. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దాం. ఇప్పటివరకు అయినది చాలు. ఈ సమయంలోనైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం వుంది’ అని పవన్ చెప్పుకొచ్చారు.

చిగురుటాకుల్లా వణుకుతుంటే..

‘ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనా కొందరు అధికార పార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్లు గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలియచేస్తున్నాయి. ప్రపంచాన్ని క్రమక్రమంగా ఆక్రమిస్తున్న కరోనా కారణంగా అగ్రరాజ్యాలుగా పేరుపొందిన దేశాలు చేష్టలుడిగి చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. అన్ని వసతులూ ఉన్న అగ్రరాజ్య ఆసుపత్రులు రోగులందరికీ సేవలు అందించలేక నానా అవస్థలు పడుతున్నాయి’ అని పవన్ తెలిపారు.

ఊహకు అందట్లేదు..

‘హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందులను పంపమని భారతదేశాన్ని ప్రాధేయపడుతున్నాయి. ఇంకో పక్క పెట్రోల్ ధరలు పాతాళంలోకి జారిపోయి చమురు ఉత్పత్తి దేశాలు దిక్కులు చూస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనపైన ప్రభావం చూపేవే. ఇక మన దేశంలో లక్షలాదిమంది కార్మికులు ముఖ్యంగా వలస కార్మికులు ఉపాధి కోల్పోయి, ఊరుకాని ఊరిలో వుంటూ అర్ధాకలితో అలమటిస్తున్నారు. రైతులు తమ పంటను అమ్ముకునే దారి లేక పెంటకుప్పల్లో పోస్తున్నారు. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ ను సైతం విడిచిపెట్టలేదు. కేసులు పెరుగుతున్న తీరుచూస్తే ఈ మహమ్మారి ఎప్పటికి శాంతిస్తోందో ఊహకు అందడం లేదు’ అని పవన్ పేర్కొన్నారు.

వెంటనే క్షమాపణ చెప్పండి..

‘గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచం అంతా ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తప్పులు వేలెత్తి చూపేవారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు అందించవలసిన తరుణంలో రాజకీయాలను భుజాలకు ఎత్తుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయి. ఆయనపై జరుగుతున్న వ్యక్తిత్వహనన దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండించవలసిన రీతిలో, ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడిగే స్థాయిలో ఉంది’ అని పవన్ డిమాండ్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.