close
Choose your channels

అందుకే సినిమాల్లో నటిస్తున్నా.. బీజేపీతో పొత్తు!?

Saturday, February 1, 2020 • తెలుగు Comments

అందుకే సినిమాల్లో నటిస్తున్నా.. బీజేపీతో పొత్తు!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారని.. బీజేపీతో పొత్తుపెట్టుకుని అన్నయ్య ప్రజారాజ్యం పార్టీలాగా చేసేశారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో జనసేనాని రియాక్ట్ అయ్యారు. ఇవాళ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పార్టీ కార్యకర్తలందరినీ ఆత్మీయంగా పలకరించారు. ఈ సమావేశంలో పవన్ మాట్లాడుతూ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. భావజాలం కలవనప్పుడు మనుషులు విడిపోతారని, ఇష్టంతో ఉండాలి తప్ప బలవంతంగా ఎవరినీ పార్టీలో ఉండమని చెప్పనని అన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నవారెవరూ కూడా పార్టీ స్థాపించినప్పుడు లేరని గుర్తు చేశారు. పార్టీ పెట్టినప్పుడు నుంచి నాతో ఉన్నది కేవలం జనసైనికులు, ఆడపడుచులేనని తెలిపారు.

అందుకే సినిమాలు చేస్తున్నా!

‘స్వశక్తితో సంపాదించిన డబ్బును వదులుకోవాలంటే సమాజంపై ప్రేమ, మనుషులపై గౌరవం ఉండాలి. పార్టీనీ, నా మీద ఆదారపడ్డ కుటుంబాలను, నా కుటుంబాన్ని పోషించడానికి సినిమాలు చేస్తున్నాను తప్ప, సినిమాలంటే ఇష్టంతో కాదు. రాజకీయాల్లో అడ్డదారుల్లో వచ్చిన సంపాదనతో నా కుటుంబాన్ని పోషించలేను. నా పిల్లలకు స్కూలు ఫీజులు కట్టలేను. అలా చేస్తే నా మీదే నాకు గౌరవం పోతుంది. నాకు నేను మోసం చేసుకుంటే ఇంకా ప్రత్యర్ధిని ఏం నిలదీస్తాను. వేలకోట్ల ఆస్తి ఉండి, నెలకో కోటి రూపాయల ఆదాయం వస్తే సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది. అవి లేకే సినిమాలు చేస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

బీజేపీతో పొత్తు...ఎమ్మెల్యే ఉన్నాడో లేడో!

‘కాపలా కాస్తూ కూర్చునే రాజకీయాలు చేయను. వ్యక్తిగత లాభమే చూసుకుంటే జనసేన పార్టీ పెట్టేవాడినే కాదు. బీజేపీలో చేరి కోరుకున్న పదవులు అనుభవించేవాడిని. సమాజహితం కోరుకున్నవాడిని కాబట్టే దెబ్బలు తినడానికైనా సిద్ధపడే జనసేన పార్టీ పెట్టాను. జనసేన పార్టీకి అండ యువత, ఆడపడుచులే. వారి నిబద్ధత, దీవెనలే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేలా చేసింది. జీవితంలో అధికారం వస్తుందో రాదో తెలియదు కానీ మీరు చూపించే ప్రేమ ముందు అధికారం కూడా చిన్నదిగానే అనిపిస్తుంది. ఎవరైన పార్టీలో ఇష్టంతో ఉండాలి కానీ బలవంతంగా ఉంచలేము. పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో లేదో తెలియదు. కాపలా కాసుకొని కూర్చొనే రాజకీయాలు చేయను. ప్రజాప్రయోజనాలు, సమాజహితం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. భావజాలం ఉన్న వ్యక్తులు మనతో నిలబడతారు. అలా లేనివారు వెళ్లిపోతారు. అయితే భవిష్యత్తులో మనల్ని ఇష్టపడే వ్యక్తులే ఎమ్మెల్యేలు అవుతారు. అధికారం కోసం అర్రులు చాచను, అడ్డదారులు తొక్కను, ఎవరి మోచేతి నీళ్లు తాగను. ఏ ఆశయంతోనైతే పార్టీ పెట్టానో ఆ ఆశయం సాధించి తీరుతాను. కష్టాలు, నష్టాలను భరిస్తాను కానీ విలువలు, జనసైనికుల నమ్మకాలను మాత్రం పోగొట్టుకోను. పార్టీ నిర్మాణం అంటే చాలా కష్ట సాధ్యమైంది. చాలా సహనంతో చేయాలి. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన వెంట చాలా మంది మేధావులు నడిచారు. అలాంటి వ్యక్తుల సమూహం మన పార్టీకి లేదు. ఓపిక, సహనంతో రాజకీయాలు చేయాలి. అలా చేస్తేనే విజయం వరిస్తుంది’ అని పవన్ చెప్పుకొచ్చారు.

Get Breaking News Alerts From IndiaGlitz