close
Choose your channels

ఇది మార్పుకు సూచకమే..: పవన్

Wednesday, January 9, 2019 • తెలుగు Comments

ఇది మార్పుకు సూచకమే..: పవన్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్ని జిల్లాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి..? జనాలతో ఎలా మమేకం కావాలి...? పార్టీని, గుర్తును ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? అని జనసేనాని దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇందులో భాగంగా మంగళవారం నాడు విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్ధుల‌తో కాసేపు ముచ్చ‌టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చ‌దువుతోపాటు రాజ‌కీయాల మీద ఆస‌క్తి చూపడం మార్పుకి సూచ‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. "విద్యార్ధి ద‌శ నుంచే బీసీ హాస్ట‌ల్స్‌, ఎస్సీ హాస్ట‌ల్స్ అంటూ కుల వ్య‌వ‌స్థ‌ని పెంచి పోషిస్తున్నార‌ు. జ‌న‌సేన పార్టీ మాత్రం అలా చేయ‌దని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.

విద్యార్ధుల భ‌విష్య‌త్తు కోసం జ‌న‌సేన పార్టీ పాటుప‌డుతుంది. విద్యార్ధుల్లో రాజ‌కీయ చైత‌న్యం రావాలి. అందుకోసం అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా వివిధ అంశాల‌పై లోతైన చ‌ర్చ‌లు జ‌ర‌పాలి" అని విద్యార్థులకు జనసేన అధినేత పిలుపునిచ్చారు. పవన్ ఇచ్చిన హామీతో సమావేశానికి వచ్చిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు మరోసారి రావాలని పలువురు విద్యార్థులు.. పవన్‌ను కోరగా రావాల్సిన టైం వస్తే రాకుండా ఆగనని చెప్పినట్లుగా తెలుస్తోంది.