close
Choose your channels

ప్రతి ఒక్కరితో భేటీ అవుతా.. ఏడు జనసేన కమిటీలు ఏర్పాటు

Tuesday, June 25, 2019 • తెలుగు Comments

ప్రతి ఒక్కరితో భేటీ అవుతా.. ఏడు జనసేన కమిటీలు ఏర్పాటు

జనసేన పార్టీకి అపార‌మైన కేడ‌ర్ ఉన్నప్పటికీ అనుభ‌వం ఉన్నవారు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఇప్పటి వ‌ర‌కు పార్టీ క‌మిటీల‌ను పూర్తి స్థాయిలో వేయ‌లేక‌పోయామ‌ని.. ఇప్పుడు అనుభ‌వం ఉన్నవారు కూడా తోడ‌వ‌డంతో పార్టీకి పూర్తి స్థాయిలో క‌మిటీలను నియ‌మించామని జనసేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి పార్టీలోని ప్రతి ఒక్కరు కృషి చేయాల‌ని, ముఖ్యంగా మీ అమూల్యమైన స‌మ‌యం, స‌ల‌హాలు, మద్దతు పార్టీకి అందించాల‌ని నాయ‌కుల‌కు పవన్ కోరారు. జ‌న‌సేన పార్టీ స్థాప‌న నాకు ఒక త‌ప‌స్సు లాంటిదని.. ఆ పార్టీని క‌డ వ‌ర‌కు ముందుకు తీసుకువెళ్తాన‌ని స్పష్టం చేశారు. అభిమానులే మ‌న పార్టీకి ఎంతో బ‌లం అని, అయితే వారిలోని ఉద్వేగాన్ని పార్టీకి ఉప‌యోగ‌ప‌డేలా మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పార్టీ నిర్మాణంలో ప్రతి నాయ‌కుడు అభిల‌ష‌నీయ‌మైన స్థాయిలో బాధ్యత తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. ప్రతి ఒక్కరు పార్టీలో ముఖ్య భూమిక పోషించాల‌ని అన్నారు.

ఏడు కమిటీల ఏర్పాటు..

జ‌న‌సేన పార్టీ క‌మిటీల‌ను పవన్ ప్రక‌టించారు. మ‌రికొన్ని క‌మిటీల‌ను త్వర‌లోనే వెల్లడిస్తామ‌ని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర లోక‌ల్‌బాడీ ఎల‌క్షన్ క‌మిటీ చైర్మన్‌గా త‌మిళ‌నాడు మాజీ చీఫ్ సెక్రట‌రీ పి.రామ్మోహ‌న్‌రావు(ఐఏఎస్‌)ను నియ‌మించారు. స్టేట్  క‌మిటీ ఫ‌ర్ మైనారిటీస్ చైర్మన్‌గా విద్యావేత్త అర్హం ఖాన్‌ను, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ క‌మిటీ చైర్మన్‌గా ద‌ళిత ఉద్యమ‌నేత అప్పిక‌ట్ల భ‌ర‌త్‌భూష‌ణ్‌ను ఎంపిక చేశారు. రాష్ట్ర మ‌హిళా సాధికారిత క‌మిటీ చైర్‌ప‌ర్సన్‌గా క‌ర్నూలుకు చెందిన రేఖాగౌడ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె వీర మ‌హిళా విభాగం చైర్మన్‌గా ఉండ‌గా, ఆ బాధ్యత‌ల నుంచి మార్పు చేశారు. పార్టీ రాష్ట్ర నిర్వహ‌ణ క‌మిటీ చైర్మన్‌గా జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ శ్రీ తోట చంద్రశేఖ‌ర్‌ (ఐఏఎస్‌)ను నియ‌మించారు.

ఎమ్మెల్యేతో పాటు ప్రముఖులకు కీలక పదవులు!

ప‌బ్లిక్ గ్రీవెన్స్ క‌మిటీ రాష్ట్ర చైర్మన్‌గా జ‌న‌సేన‌ శాస‌న స‌భ్యులు రాపాక వ‌ర‌ప్రసాద్ (రాజోలు) పేరును ఖ‌రారు చేశారు. గ‌వ‌ర్నమెంట్ ప్రోగ్రామ్స్ మోనిట‌రింగ్ క‌మిటీ రాష్ట్ర చైర్మన్‌గా చింత‌ల పార్ధసార‌థిని ఎంపిక‌ చేశారు. రాష్ట్ర లోక‌ల్ బాడీ ఎల‌క్షన్ క‌మిటీలో స‌భ్యులుగా పంతం నానాజీ (తూర్పుగోదావ‌రి జిల్లా), బొలిశెట్టి శ్రీనివాస్‌ (తాడేపల్లిగూడెం), చిల‌కం మ‌ధుసూద‌న్‌రెడ్డి (ధ‌ర్మవ‌రం), పితాని బాల‌కృష్ణ‌ (ముమ్మడివ‌రం), స‌య్యద్ జిలాని (న‌ర‌స‌రావుపేట‌), అంకెం ల‌క్ష్మీశ్రీనివాస్‌ (పెడ‌న‌), కోత పూర్ణచంద్రరావు (ప‌లాస‌), పాటంశెట్టి సూర్యచంద్ర (జ‌గ్గంపేట‌), సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌ (య‌ల‌మంచిలి), సుంక‌ర శ్రీనివాస్‌ (క‌డ‌ప‌), ఘంట‌సాల వెంకట‌ల‌క్ష్మి (దెందులూరు), కాకినాడ మాజీ మేయ‌ర్‌ పొల‌స‌ప‌ల్లి స‌రోజు, షేక్ రియాజ్‌ (ఒంగోలు), వై.శ్రీను (రాజ‌మండ్రి), బాడ‌న వెంక‌ట జ‌నార్ధన్‌ (ఎచ్చెర్ల), ఇంజా సోమ‌శేఖ‌ర్‌రెడ్డి (ప్రొద్దుటూరు) త‌దిత‌రుల‌ను నియ‌మించారు. మిగిలిన క‌మిటీల స‌భ్యుల వివ‌రాల‌ను ఆయా క‌మిటీల చైర్మన్లతో మాట్లాడిన అనంత‌రం ప్రక‌టిస్తామ‌ని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Get Breaking News Alerts From IndiaGlitz