అడ్డంకులు చీల్చుకుంటూ 'వకీల్ సాబ్' ప్రపంచ రికార్డ్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ సత్తా గురించి అందరికి తెలిసిందే. పవన్ సినిమా రిలీజ్ అంటే ఆరోజు అభిమానులకు పండగ వాతావరణం. అజ్ఞాతవాసి తర్వాత పాలిటిక్స్ కోసం గ్యాప్ తీసుకున్న పవన్ వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేని స్టోరీ బేస్డ్ మూవీ కావడంతో వసూళ్లపై ప్రభావం ఉంటుందని ట్రేడ్ భావించింది. కానీ పవర్ స్టార్ ప్రభంజనాన్ని ఎలాంటి అడ్డంకులు ఆపలేకపోయాయి.

పవన్ రెగ్యులర్ చిత్రాల తరహాలోనే వకీల్ సాబ్ కోవిడ్ పరిస్థితుల్లో కూడా వసూళ్లు కురిపించింది. అప్పుడే నెమ్మదిగా మొదలవుతున్న సెకండ్ వేవ్ పరిస్థితులు, టికెట్ ధరలు వకీల్ సాబ్ చిత్ర వసూళ్లపై ప్రభావం కొంతమేరకు ప్రభావం చూపినప్పటికీ.. పవర్ స్టార్ స్టామినాకి అడ్డుకట్ట వేయలేకపోయాయి.

తక్కువ రోజుల్లోనే వకీల్ సాబ్ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా వకీల్ సాబ్ పేరిట మరో రికార్డు నమోదైంది. అది కూడా ప్రపంచ రికార్డు కావడం విశేషం. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రాల జాబితాలో వకీల్ సాబ్ 64వ స్థానంలో నిలిచింది. విజయ్ మాస్టర్ మూవీ 45 స్థానం దక్కించుకుంది. రవితేజ క్రాక్ మూవీ 70వ స్థానం దక్కించుకోవడం విశేషం. మాస్టర్, వకీల్ సాబ్ మాత్రమే టాప్ 65 లో చోటు దక్కించుకున్న ఇండియన్ మూవీస్.

పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. బలమైన పింక్ కథకు వేణు శ్రీరామ్.. పవన్ కళ్యాణ్ స్టైల్ జోడించి మ్యాజిక్ చేశారు. తమన్ సంగీతంతో అదరగొట్టేశాడు. ఫలితంగా వకీల్ సాబ్ సూపర్ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయ్యప్పన్ కోషియం రీమేక్, హరిహర వీరమల్లులో పవన్ నటిస్తున్నాడు. హరిహర వీరమల్లు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రం.