జనసేన-టీడీపీ చీకటి పొత్తులు జనాలకు తెలుసు!!

  • IndiaGlitz, [Saturday,April 20 2019]

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది. ఎన్నికల ముందు వరకు ప్రచార సభల్లో.. పోలింగ్ తర్వాత నెట్టింట్లో యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. జనసేన ఎంపీ అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీనారాయణ మధ్య రోజురోజుకు ట్వీట్ వార్ పెరుగుతోంది. మొదట విజయసాయి ట్వీట్ చేయగా అందుకు కౌంటర్‌గా మాజీ జేడీ ట్వీట్ చేయడం ఇలా ఒకరినొకరు తిట్టి పోసుకుంటున్నారు. తాజాగా మరోసారి జనసేన నేతను కార్నర్ చేసిన విజయసాయి తీవ్ర దుమారం రేపే ట్వీట్స్ చేశారు. కాగా ఈ మొత్తం వ్యవహారానికి కారణం.. జనసేన 88 సీట్లు వస్తాయని లక్ష్మీనారాయణ స్టేట్‌మెంట్ ఇవ్వడమే.

ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారు..!

పాపం! బాలక్రిష్ణ చిన్నల్లుడు భరత్‌కు టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి మద్ధతు మాత్రం మీకివ్వమని తండ్రీ కొడుకులిద్దరూ కేడర్‌కు చెప్పిన విషయం నిజం కాదా జేడీ గారూ? ఓట్లు చీల్చి జనాలను వెర్రి పుష్పాలు చేసేందుకు వేర్వేరుగా పోటీ చేశారు. మీ చీకటి పొత్తులను ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారు అని విజయసాయి చెప్పుకొచ్చారు.

తమరే సంయుక్త సంచాలకులు..

లక్ష్మీనారాయణ గారూ… మీరు ఈ రోజుకూ జేడీనే. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశానికి-జనసేనకు జాయింట్ డైరెక్టర్! నేరగాళ్ళ పార్టీకి, విలువల్లేని పార్టీకి తమరే సంయుక్త సంచాలకులు! అని విజయసాయి విమర్శలు గుప్పించారు.

మూడు నెలల్లో మూడు పార్టీలు..

జేడీ గారూ… మీరు 2 నెలల క్రితం లోక్ సత్తా కండువా కప్పుకోబోయి… నెల క్రితం భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యి…ఆ తర్వాత 2 రోజుల్లోనే జనసేన తరఫున విశాఖ ఎంపీగా బరిలోకి దిగారు. 3 నెలల్లో 3 పార్టీలు! అహా… ఏమి ప్రజాస్వామిక విలువలు? ఏమి రాజకీయ విలువలు? అని అంటూ మాజీ జేడీపై ఆయన సెటైర్ల వర్షం కురిపించారు.

తెలుగుదేశం చెపితేనే ఇచ్చాం అని..!

జేడీ గారూ… మీ టిక్కెట్ల లోగుట్టు అందరికీ తెలిసినదే. తీర్థం (బీఫామ్ మీద సంతకం) జనసేనది…. ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చినది 175లో 65 బీఫామ్లు. కాదు… మొత్తం తెలుగుదేశం చెపితేనే ఇచ్చాం అని మీరు ఒప్పుకోదలుచుకుంటే మీ ఇష్టం! అని విజయసాయి ట్వీట్ చేశారు.

మీకు చక్కగా సరిపోతుంది!

His Master's Voice (HMV) అన్న బిరుదు మీకు చక్కగా సరిపోతుంది జేడీ గారూ. తెలుగుదేశంలో చేరాలనుకుని ముహూర్తం కూడా పెట్టుకున్నాక, మీ బాస్ చెప్పినట్టు ఆఖరిక్షణంలో జనసేనలో చేరారు. మీ కమిట్‌మెంట్‌ను అభినందించాల్సిందే. ఒకటి నుంచి ఐదు అంకెల్లో ఏది లక్కీ నంబరో వెతుక్కుని లెక్కలు వేసుకోండి అని మాజీ జేడీకి ఆయన సూచించారు.

చరిత్ర చాలా సార్లు రుజువు చేసింది!

జేడీ గారూ, మీ నాయకుడు కుప్పం, మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో ఒక మాట అడిగి క్లారిటీ ఇవ్వండి. 88 సీట్లు గెలుస్తారో లేదో దీన్ని బట్టే తెలిసి పోతుంది. ‘ప్రశ్న ప్యాకేజీ కోసం రాజీపడి పాదాక్రాంతమైతే’ ప్రజలు నిర్దయగా గుణపాఠం చెబుతారని చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది అని వైసీపీ ఎంపీ హితవు పలికారు. కాగా ఈ ట్వీట్లకు జనసేన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నారు.