close
Choose your channels

గాడిద పాలతో చేసిన సబ్బు కోసం జనం పోటెత్తారు

Tuesday, January 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గాడిద పాలతో చేసిన సబ్బు కోసం జనం పోటెత్తారు

'గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు' అని వేమన చెప్పిన పద్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ పద్యం ఇప్పుడు రివర్స్‌లో చదువుకోవాల్సిన రోజులొచ్చాయి. పాపం వేమన అప్పట్లో గాడిద పాలను తక్కువ అంచనా వేశారు కానీ ఇప్పుడు అదే పాలకోసం జనాలు పరుగులు పెడుతున్నారు. బహుశా ఆయనుండుంటే మళ్లీ పద్యం రివర్స్ చేసి.. 'గరిటెడైనను చాలు ఖరము పాలు..' అంటూ పద్యాన్ని తిరగ రాసేవారేమో!. ఎందుకంటే.. కడివెడు గంగిగోవు పాల ధర కంటే.. గరిటెడు గాడిద పాల ధరే ఎక్కువైంది మరి. అంతేకాదు రానున్న రోజుల్లో పూర్తిగా గాడిద పాల పెంపకం ప్రాంభమవుతుందన్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.

ఇక అసలు విషయానికొస్తే.. ఇప్పటి వరకూ గాడిద పాలను పలురకాలుగా వాడుతున్నారు. అయితే తాజాగా సబ్బుల తయారీకి వాడుతున్నారని వెలుగులోకి రావడం గమనార్హం. ఈ వ్యవహారం ఛండీగఢ్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఆర్గానిక్‌ ఫెస్టివల్ ప్రదర్శనలో తేలింది. ఈ షోలో గాడిద పాలతో చేసిన సబ్బు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సబ్బును దేశ రాజధాని ఢిల్లీలో ఉండే అంకుర సంస్థ అయిన ‘ఆర్గానికో’ తయారు చేస్తోంది. గాడిద పాలతో సబ్బులని తెలుసుకున్న జనాలు.. ఓ లుక్కేసిపోదామని పోటెత్తారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరుగుతోంది.

నాడు వద్దొన్నారు.. నేడు పోటెత్తుతున్నారు!

కాగా.. ఇదివరకు గాడిదను చూసినా.. గాడిద పాలన్నా ఎంత తక్కువగా చూసేవాళ్లమో. ప్రతీ కుక్కకీ ఓ రోజు వస్తుందన్నట్లుగా ‘ఇట్స్ టైమ్ ఫర్ డాంకీ’ అన్న మాట. అయితే కేవలం 100 గ్రాములు మాత్రమే బరువున్న ఈ సబ్బు ధర 499 రూపాయిలు. ఈ రేంజ్‌‌లో రేటున్నా జనాలు మాత్రం ఏ మాత్రం వెనకడుగేయకుండా ఎగబడి మరీ కొంటుండటం గమనార్హం.

ఇందుకే ఎగబడుతున్నారు..!

గాడిద పాలలో ఎక్కువ ఔషధ లక్షణాలు ఉండడం వల్ల లీటరు రూ.2 వేలు ఉంటుందని అందుకే సబ్బు కోసం ఈ రేంజ్‌‌లో ఎగబడుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గాడిద పాలతో సబ్బును తయారు చేసే ఈ ప్రాజెక్టును 2017లో మహారాష్ట్రలోని షోలాపూర్‌లో మొదలుపెట్టామని ఆర్గానికో సంస్థ వ్యవస్థాపకులైన పూజా కౌల్‌, రిషభ్‌ చెప్పుకొచ్చారు. త్వరలోనే గాడిద పాలతో తయారు చేసిన ఫేస్‌వాష్‌, మాయిశ్చరైజర్‌ను సైతం మార్కెట్‌లోకి తెస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

ఉపయోగాలివీ..

గాడిద పాలలో ఎన్నో ఆయుర్వేద సుగుణాలు ఉంటాయి.

ముఖ్యంగా వయసు పైబడకుండా కనిపించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

గాడిద పాలలో ఉండే సుగుణాలు చర్మంపై ముడతలు రాకుండా సాయపడతాయి.

యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా బాగా ఉపయోగపడతాయి.

అయితే నిర్వాహకులేమో చాలానే చెబుతున్నారు కానీ.. ఎవరైనా వాడితే కదా.. అసలేంటి పరిస్థితి అనేది తెలిసేది. దీనిపై చిన్నపాటి రివ్యూ గానీ.. లేకుంటే ఈ సబ్బును వాడిన వారు కాసింత చెబితే తప్ప దీని భవితవ్యం ఏంటో తెలిసేలా లేదు. ఈ సబ్బుపై టాక్ ఎప్పుడు బయటికొస్తుందో ఏమో!.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.