టికెట్ ధరల వివాదం... ముగిసిన ఆర్జీవీ - పేర్ని నాని భేటీ , చివరికి ఏం తేల్చారంటే..?

ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా థియేటర్ల మూసివేత, టికెట్ ధరల తగ్గింపు వ్యవహారం చర్చకు వచ్చింది. సమావేశం అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పేర్ని నానితో సమావేశం సంతృప్తి నిచ్చిందన్నారు. ప్రధానంగా టికెట్ల రేట్ల తగ్గింపును ప్రస్తావించానని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. థియేటర్ల మూసివేతపై తమ మధ్య ఎలాంటి చర్చా జరగలేదని ఆయన తెలిపారు. ధరల కేటాయింపుపై ఎవరికీ అధికారం ఉండకూడదని వర్మ స్పష్టం చేశారు.

సినీ రంగంతో తనకున్న 30ఏళ్ల అనుభవంతో ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చానని వర్మ చెప్పారు. ఆయన కూడా కొన్ని విషయాలను తన దృష్టికి తీసుకొచ్చారని... వాటిని సినీరంగానికి చెందిన వారిని కలిసి చర్చిస్తానని ఆర్జీవీ తెలిపారు. అందరికీ ఒక పరిష్కారం లభిస్తుందని ఆయన ఆకాంక్షించారు. టికెట్‌ రేట్లు తగ్గిస్తే ఇండస్ట్రీకి చాలా నష్టం వస్తుందని మంత్రికి వివరించానని వర్మ చెప్పారు. నిర్మాతగా నా అభిప్రాయం వినిపించేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చానని .. తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే సినిమా టికెట్ ధరలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు చట్ట ప్రకారమే జరుగుతున్నాయని .. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టే ప్రభుత్వం మాది కాదని, నిబంధనలు అందరికీ ఒక్కటేనని పేర్ని నాని తేల్చిచెప్పారు. ఇప్పటికే సినిమా టికెట్ అంశానికి సంబంధించి కమిటీ ఏర్పాటైందని... దాని సూచనల ప్రకారం నిర్ణయాలు ఉంటాయని మంత్రి తెలిపారు. రామ్ గోపాల్ వర్మ చెప్పిన అంశాలను ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో సినిమా థియేటర్లకు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నామనిపేర్ని నాని విజ్ఞప్తి చేశారు.