close
Choose your channels

గెలుపు టీడీపీదే.. ఇది పీకే టీమ్ మాట!!

Monday, April 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గెలుపు టీడీపీదే.. ఇది పీకే టీమ్ మాట!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సీజన్ ముగిసింది. ఓటరు దేవుడు కరుణించేశాడు.. ఎవర్ని ఇంటికి పంపాలో.. ఎవర్ని అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపాలో తీర్పునిచ్చేశాడు. ప్రస్తుతం నేతల భవితవ్యాలు స్ట్రాంగ్ రూమ్‌లో పదిలంగా భద్రపరిచి ఉన్నాయి. మే-23న గెలుపెవరిదో.. ఓటమెవరిదో తేలిపోనుంది. అయితే ఈ గ్యాప్‌‌లోనే నేతలు మాటల తూటాలు పేల్చేసుకుంటున్నారు. తమదే గెలుపని టీడీపీ నేతలు.. కాదు కాదు కచ్చితంగా తమ పార్టీనే గెలుస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో జనసేన సైతం మా పార్టీనే కింగ్ మేకర్ అంటూ చెప్పుకుంటున్నాయి. అయితే 23 వరకు కాస్త ఓపిక పడితే గెలిచి అధికారంలోకి వచ్చేదెవరో.. ప్రతిపక్షంలో కూర్చునేదెవరో తేలిపోనుంది.

దేశం మొత్తం చూసింది..

తాజాగా ఈ వ్యవహారంపై మైలవరం టీడీపీ అభ్యర్థి, ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరరావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్ని కుట్రలు చేసినా.. టీడీపీనే విజయం సాధిస్తుందని జోస్యం చెప్పుకొచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. "కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ. 300 కోట్లు ప్రశాంత్ కిషోర్ టీమ్ కోసం ఖర్చు చేశారు. ఆయన.. పీకే టీమ్‌లోని సిబ్బంది తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి రాబోతోందని చెబుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాపిక్ బహిర్గతమైంది. దేశ రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలని చైతన్యపరిచింది. ఎన్నికల నిర్వహణ తీరు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గం కొటికలపూడిలో మర్నాడు ఉదయం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. సీఎం చంద్రబాబు పిలుపునందుకుని టీడీపీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు ఆరు ఏడు గంటల పాటు క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్లు వేసినవారందరికీ ధన్యవాదాలు. వైసీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ ఉమ్మడి కుట్రలను ఆగ్రహించిన రాష్ట్ర ప్రజానీకం టీడీపీకి అండగా నిలిచారు"అని దేవినేని చెప్పుకొచ్చారు.

జగన్‌కు చిత్తశుద్ధి లేదు..

"ముఖ్యమంత్రి పదవి వ్యామోహం తప్ప జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. సీఎం నేమ్ ప్లేట్ తయారుచేయించుకుని పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కడం కష్టమే. జగన్ ముఖ్యమంత్రి అయిపోయినట్టుగా భ్రమల్లో బ్రతుకుతున్నారు. ఎన్నికల సందర్భంగా మునుపెన్నడూ లేనివిధంగా అరాచకాలు సృష్టించారు. ప్రశాంత్ కిషోర్ మార్గదర్శకత్వంలో బీహార్ తరహా అరాచకాలను ఏపీలో సృష్టించాలని కుట్రలు పన్నారు. లోటస్ పాండ్ కేంద్రంగా కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు జగన్ పనిచేస్తున్నాడు. దేశంలో బీజేపీయేతర పార్టీలు లేకుండా చేయాలని నియంతృత్వధోరణితో మోడీ కుట్రలు పన్నుతున్నారు.. తెలుగువాళ్లు ఎక్కడున్నా తెలుగుజాతి ప్రయోజనాల కోసం తిరగబడాలి" అని దేవినేని పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ముఖ్యంగా.. పీకే ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.