close
Choose your channels

చంద్రబాబుపై దాడికి కుట్ర జరిగిందా.. ఎందుకీ రహస్య డ్రోన్లు!?

Friday, August 16, 2019 • తెలుగు Comments

టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడికి కుట్ర జరిగిందా..? ఎవరికీ తెలియకుండా చంద్రబాబు ఇంట్లోకి రహస్యంగా డ్రోన్లు ఎలా వెళ్లాయి..? ఇంతకీ ఈ కుట్రవెనుక ఉన్నవారెవరు..? వరద గురించి తెలుసుకోవడానికే ఇలా చేశారా..? మరో పెద్ద కుట్రమైనా ఉందా..? అనేది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

అసలేం జరుగుతోంది!

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. మరీ ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు కొన్ని లోతట్టు ప్రాంతాల జలమయమయ్యాయి. ముఖ్యంగా.. విజయవాడలోని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసం పరిసర ప్రాంతం సముద్రాన్ని తలపించింది. దీంతో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదంతా గురువారం రోజు జరిగిన వ్యవహారం కాగా.. శుక్రవారం నాడు చంద్రబాబు నివాసంపై డ్రోన్లు వినియోగించి మరీ కొందరు ప్రైవేట్ వ్యక్తులు చిత్రీకరిస్తున్న వారిని టీడీపీ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో బాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న దేవినేని అవినాష్, ఇతర నాయకులు హుటాహుటిన చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా.. డ్రోన్ ప్రయోగించిన వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిజాలు కప్పిపుచ్చే ప్రయత్నమంటూ టీడీ జనార్దన్, దేవినేని అవినాష్ ఆందోళన కు దిగారు. అంతేకాదు.. పోలీసు జీపుకు అడ్డంగా బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ కార్యకర్తలు, నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ సీఎం ఇంటిపై డ్రోన్‌ కెమెరా ఎలా వినియోగిస్తారు? అని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు స్పందన..!

తాను నివసించే ఇంటిపై డ్రోన్లు ఎగరడమేంటి..?అని చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. డీజీపీ, జిల్లా ఎస్పీతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. హై సెక్యూరిటీ జోన్‌లో డ్రోన్లు ఎగరడంపై చంద్రబాబు అధికారులను నిలదీశారు. డ్రోన్లు వినియోగించింది ఎవరు?...అనుమతులు ఎవరిచ్చారు..?
నేను ఉండే నివాసంపై డ్రోన్లతో నిఘా పెట్టింది ఎవరు..? చివరికి నా భద్రతనే ప్రశ్నార్ధకంగా మారుస్తారా..? అని ఏపీ సర్కార్‌పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. అంతేకాదు.. డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా డ్రోన్లు ఎగరేయడానికి వీల్లేదన్న విషయాన్ని బాబు గుర్తు చేశారు.

పట్టుబడ్డారు..!

కాగా.. డ్రోన్స్ వాడుతున్న ఇద్దర్ని టీడీపీ కార్యకర్తలు పట్టుకున్నారు, నిన్న పంద్రాస్టు వేడులను డ్రోన్‌లతో తామే చిత్రీకరించామని పట్టుబడిన వ్యక్తులు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌ నివాసంలో ఉండే కిరణ్‌ అనే వ్యక్తి డ్రోన్లతో కృష్ణా నది ప్రవాహం విజువల్స్‌ తీయమని చెప్పారని డ్రోన్‌ ఆపరేటర్‌ స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే.. మాజీ సీఎం చంద్రబాబుపై దాడికి కుట్ర జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నివాసం, సెక్యూరిటీ సిబ్బంది రూమ్‌లు, ఇంటికి వెళ్లే మార్గాలు చిత్రీకరించినట్టు టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నివాసానికి పోటాపోటీగా పోలీసులు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించారు.

ఇరిగేషన్ శాఖ స్పందన..

డ్రోన్ల వినియోగం రాద్ధాంతం జరుగుతుండగానే ఇరిగేషన్ శాఖ ఓ ప్రకటన చేసింది. వరద పరిస్థితిపై అంచనా కోసం వీడియోలు తీశామని అధికారులు స్పష్టం చేశారు. ఎగువ నుంచి మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ముంపు ప్రాంతాలపై అవగాహన కోసమే డ్రోన్లు వినియోగిస్తున్నట్లు అధికారులు తేల్చిచెప్పారు. మరి ఈ వివాదం ఇంతటితో ఫుల్‌స్టాప్ పడుతుందో లేకుంటే మరింత ముదురుతుందో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz