close
Choose your channels

కూల్చేస్తాం.. సర్జికల్ స్ట్రైక్.. బతకనివ్వం.. ఇవా ఎన్నికల ప్రచారాంశాలు?

Friday, November 27, 2020 • తెలుగు Comments

పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చేయాలి.. వాటిని కూల్చేసిన రెండు గంటల్లోపే దారుస్సలాంను కూల్చేస్తాం.. బీఫ్ బిర్యానీ, పంది బిర్యానీ తినిపిస్తాం... పాత బస్తీ మీద సర్జికల్ స్ట్రైక్స్.. బతకనివ్వం.. గల్లీల్లో తిరగనివ్వం.. ఇవన్నీ ఏంటో తెలంగాణ వాసులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారాంశాలు. అభివృద్ధి గురించి ఊసే లేదు.. ఆయా పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోల్లోనూ.. ప్రలోభాలే తప్ప జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఒక్కరూ చెప్పింది లేదు.

10 వేలంటే.. 25 వేలు.. 50 వేలు..

మేనిఫెస్టోల్లో.. ఒకరు వరద బాధితులకు పది వేలు ఇస్తామంటే.. మరొకరు.. 25 వేలు.. ఇంకొకరు.. 50 వేలు.. ఏంటీ పందేరాలు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? పోటీలు పడి ఈ ప్రకటనలేంటి? ఒకవేళ నిజంగా గెలిస్తే ఇస్తారా? ఎక్కడి నుంచి అంత డబ్బు తెచ్చిస్తారు? ఏమైనా సొంత జేబుల నుంచి పెడతారా? ఎందుకీ ఆచరణ సాధ్యంకాని హామీలు.. వాటర్ బిల్లు మాఫీ అని ఒకరంటే.. కరెంటు బిల్లు మాఫీ అని మరొకరు.. పోటీలు పడి హామీలు.. ఎంత కాలం తీసుకోరు? ఎవరిని ఉద్ధరిస్తున్నారు? రోడ్లపై గుంతలు.. వర్షం వస్తే కాలనీలన్నీ నీటిలోనే.. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లేదు.. ఇలాంటి ఎన్నో సమస్యలను గాలికొదిలి.. ప్రలోభపెట్టే హామీలతో పార్టీలన్నీ ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి.

ఎంఐఎం కార్యకర్తలు మిమ్మల్ని బతకనివ్వరు..

మేనిఫెస్టోను వదిలేద్దాం.. ప్రచారం విషయానికి వస్తే.. ట్యాంక్‌బండ్ ఆక్రమణల నిలిపివేతలో భాగంగా ఎన్టీఆర్, పీవీ ఘాట్‌లను కూల్చేయాలి అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఈ వ్యాఖ్యలు అవసరమా? పోనీ.. దీనిని ఏమైనా బీజేపీ లైట్ తీసుకుందా? అంటే అదీ లేదు. ఎన్టీఆర్, పీవీ ఘాట్‌లను కూల్చేసిన రెండు గంటల్లోపే దారుస్సలాంను కూల్చేస్తామని ప్రకటన. తామేమైనా తక్కువ తిన్నామా? అంటూ కిషన్ బాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి హుస్సేనీ పాషా తాము గెలిస్తే పాతబస్తీ గల్లీలలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఎంఐఎం కార్యకర్తలు మిమ్మల్ని బతుకనివ్వరని, దశాబ్దాలుగా ఇక్కడే స్థిరపడి ఉన్నా.. వెళ్లిపోక తప్పదని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.

ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు?

మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం.. తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్‌ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయంటూ వ్యాఖ్యానించడమే కాకుండా.. సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. దీనికి బీజేపీ నేతలు.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఎవరు కల్పిస్తున్నారో ముఖ్యమంత్రి కేసీఆరే బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా మాటకు మాట అనుకుంటూ ఎవరూ తగ్గడంలేదు. సామాన్య ప్రజానీకానికి ఏం కావాలనే దిశగా ఆలోచనే లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టంతా జీహెచ్ఎంసీ పైనే ఉంది. ఈ ప్రజానీకానికి ఈ రాజకీయ పార్టీలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాయో అవే తేల్చుకోవాలి.

Get Breaking News Alerts From IndiaGlitz