Download App

Prema Katha Chitram 2 Review

ఆరేళ్ల క్రితం విడుద‌లైన `ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ ` ..తెలుగులో  హార‌ర్ కామెడీ చిత్రాల‌కు కేరాఫ్‌గా మారింది. ఈ సినిమా స్ఫూర్తితో చాలా హార‌ర్ కామెడీ సినిమాలు రూపొందాయి. ఆరేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2` కూడా అదే కాన్సెప్ట్‌తో రూపొందింది. ట్రైల‌ర్ చూస్తే హార‌ర్ కామెడి జోన‌ర్ సినిమాయే. ఒక నిర్మాత మిన‌హా ఎంటైర్ యూనిట్ మారింది. మ‌రి ఈ సినిమా ఎలా మెప్పిస్తుందోతెలుసుకోవాలంటే ముందు క‌థేంటో చూద్దాం. 

కథ:

సుధీర్‌ (సుమంత్‌ అశ్విన్‌)... నందు(నందితా శ్వేత)లు ప్రేమించుకుంటారు. అయితే డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని కాలేజ్‌లో చేరుతారు. అదే కాలేజ్‌లో ఉండే బిందు(సిద్ది ఇద్నాని), ముందు సుధీర్‌తో గొడవ పడ్డా, చివరకు తనను ప్రేమిస్తుంది. కానీ సుధీర్‌ తను నందుతో ప్రేమలో ఉన్నానని చెప్పేస్తాడు. తర్వాత నందు, ఓ ఫాంహౌస్‌కి వెళతాడు. ఆ ఫాంహౌస్‌లో అంతా విచిత్రంగా కనపడతాయి. దాంతో తన స్నేహితుడు బబ్లూ(కృష్ణ చైతన్య)ని పిలుస్తాడు. బబ్లూ ఫాంహౌస్‌లోకి వస్తాడు. కానీ అక్కడెవరో తిరుగుతున్నట్లు, శబ్దాలు చేస్తున్నట్లు సుధీర్‌కి , బబ్లూకి తెలుస్తుంది. అయితే ఎవరా అని చూస్తే అది నందు. నందు రాత్రంతా వాళ్లను భయపెడుతూ.. పగలు మాత్రం మాయమైపోతుంటుంది. అసలేం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో తమ స్నేహితురాలు అనిత(విద్యుల్లేఖా రామన్‌)ని కలుస్తారు. అసలు సుధీర్‌, బబ్లూ అనితను ఎందుకు కలుస్తారు. నందు రాత్రిళ్లు ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది? అసలు బిందు ఏమైంది? చిత్ర అనే అమ్మాయికి, బిందుకి, నందుకు ఉన్న రిలేషన్‌ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష:

సుమంత్‌ అశ్విన్‌ కాలజ్‌ అబ్బాయిలా, దెయ్యం పట్టిన వాడిలా చక్కగా నటించాడు. తన పాత్రకు సుమంత్‌ అశ్విన్‌ న్యాయం చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో బాగా నటించాడు. ఇక నందితా శ్వేత దెయ్యం పిల్లలా సినిమా అంతటినీ తనే రన్‌ చేసే పాత్రలో కనిపించింది. ఇక సిద్ది ఇద్నాని, కీలకంగా చిత్ర పాత్రలో నటించిన మరో అమ్మాయి ఓకే అనిపించారు. ఇక కృష్ణ చైతన్య తెలంగాణయాసలోని డైలాగ్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక తను చేసిన కామెడీ లేకిగా అనిపిస్తుంది. ప్రేమకథా చిత్రమ్‌లోని కామెడీ.. ఈ సినిమాలో కామెడీకి పొంతనే లేదు. సినిమాలోని సన్నివేశాలకు పెట్టిన లింక్స్‌ చివర్లో రివీల్‌ చేసినా అవి ఫ్లోను దెబ్బ తీశాయే తప్ప మరెందుకూ పనిచేయలేదు. అసలు హీరో ఫాంహౌస్‌లో దెయ్యం ఉందని తెలిసినా ఎందుకు ఉండాలనుకుంటాడు? తన లవర్‌ను తీసుకుని వెళ్లిపోవచ్చు. సరే! ఆ అమ్మాయి పగలు కనపడకుంటే తనకూడా వెళ్లిపోవచ్చు కదా! అలా వెళ్లి పోకుండా ఆ దెయ్యం చుట్టూనే తను తిరుగుతూ స్నేహితులను తిప్పుతుంటాడు. హరికిషన్‌ పాత ప్రేమకథా చిత్రమ్‌కు లింక్‌ పెడుతూ రాసుకున్న సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. అసలు కథను చివరలో చూపించాడు కానీ.. అంతకు ముందు వరకు అనవసరమైన కామెడీ సన్నివేశాలతో సినిమాను రన్‌ చేయించాడు. సినిమా సరిగ్గా లేకపోవడం అనేది పూర్తిగా డైరెక్టర్‌ హరికిషన్‌ ఖాతాలోకి వెళ్లాల్సిందే. సినిమా క్వాలిటీ, జెబి సంగీతం, నేపథ్య సంగీతం ఏ మాత్రం బాగా లేవు. ఎడిటింగ్‌ పరావాలేదు. నిర్మాణ విలువలు జస్ట్‌ ఓకే. సక్సెస్‌ఫుల్‌ సినిమాలకు సీక్వెల్స్‌ చేసేటప్పుడు ఆసక్తికరమైన కథ, కథనం అవసరం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ వాటికి తమ వంతు సపోర్ట్‌ మాత్రమే అందించగలరు. మంచికథ లేకపోతే.. ఎంత పెద్ద ఆర్టిస్టులైనా ఏమీ చేయలేరు.

బోటమ్‌ లైన్‌: 'ప్రేమకథా చిత్రమ్‌ 2'... బోరింగ్‌ హారర్‌ కామెడీ సీక్వెల్‌

Read Prema Katha Chitram 2 Review in English

Rating : 0.5 / 5.0