close
Choose your channels

‘సరస’ సంభాషణ ఎఫెక్ట్.. చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా

Monday, January 13, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘సరస’ సంభాషణ ఎఫెక్ట్.. చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా

టాలీవుడ్ ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్‌కు.. మహిళా ఉద్యోగినికి సరస సంభాషణ చేస్తున్నట్లు ఓ ఆడియో నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆయన స్పందించి.. టేపుల్లో ఉండే వాయిస్ తనది కాదని తీవ్రంగా ఖండించారు. అయితే అధిష్టానం ఇప్పటికే పృథ్వీ తీరుపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉండటంతో రాజీనామాకు ఆదేశించింది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఈ వ్యవహారంపై సీరియస్ యాక్షన్ తీసుకుని రాజీనామా చేయించాలని కోరడం.. వెంటనే పృథ్వీకి కాల్ వెళ్లడం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు థర్టీ ఇయర్స్ పృథ్వీ అధికారికంగా ప్రకటించారు. అనంతరం మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. తనపై కక్షగట్టి, ఎదుగుదలను తట్టుకోలేక కొందరు కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు.

విచారణ తర్వాతే అడుగుపెడతా!
ఎస్వీబీసీ ఉద్యోగినితో అసభ్య సంభాషణ చేసినట్టు వచ్చిన ఆరోపణలను పృథ్వీ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలకు తాను తీవ్రంగా బాధపడుతున్నానన్నారు. అయితే.. తనను అధిష్టానం రాజీనామా చేయాలని ఆదేశించలేదని తనకు తానుగా తనపై వచ్చిన ఆరోపణలపై రాజీనామా చేసి.. మెయిల్ పంపానని చెప్పుకొచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని టీటీడీని తానే స్వయంగా కోరాననన్నారు. అదే విధంగా ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీడియా ముఖంగా ఆయన తెలిపారు. తనపై విచారణ తేలిన తర్వాతే ఎస్వీబీసీలో అడుగుపెడతానని ఈ సందర్భంగా ఆయన శపథం చేశారు.

పృథ్వీ సవాల్..!
‘పద్మావతి గెస్ట్ హౌస్‌లో నేను మద్యం సేవించినట్లు కొందరు చెబుతున్నారు. నాకు మద్యం తాగే అలవాటు లేదు. అవసరమైతే నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షంచుకోండి. నాపై ఇలాంటి ఆరోపణలకు నేను సవాల్ విసురుతున్నాను. నేను మందుతాగినట్లు నిరూపితమైతే ఇదిగో ఈ చెప్పుతో కొట్టండి (చెప్పుతీసి చూపిస్తూ). నేను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తాను. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఖండించాను’ అని ఈ సందర్భంగా పృథ్వీ చెప్పుకొచ్చారు.

దేవుడి సాక్షిగా చెబుతున్నా..!
‘నాలుగు నెలలుగా నాపై కుట్రలు పన్నారు. నన్ను అసభ్యంగా దూషిస్తూ ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. రోజూ నన్ను దూషిస్తూ ఫోన్ కాల్స్ వచ్చేవి. పోలీస్‌లకు ఫిర్యాదు కూడా చేశాను. సినీ నిర్మాత అశ్వనీదత్‌ను నేను ఎంతో గౌరవిస్తాను. అలాంటి వ్యక్తి.. నన్ను దూషిస్తూ మాట్లాడటం బాధాకరం. ఆయన విజ్ఞతకే ఆ మాటలు వదిలేస్తున్నాను. నేను నమ్ముకున్న దేవుడి సాక్షిగా చెబుతున్నాను.. ఆరోపణలు చేసిన వారెవ్వరూ బాగుపడరు (భావోద్వేగంతో). నా పదవికి రాజీనామా చేశాను గనుక.. ఇక ఒక్కొక్కర్ని కడిగి పారేస్తాను.

హైకమాండ్‌కు వివరణ.. ఫొరెన్సిక్‌కు టేపులు!
‘నాపై కక్షతోనే ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ పని ఎవరు చేశారన్నది భగవంతుడికే వదిలేస్తున్నాను. ఇదే విషయాన్ని వైసీపీ హైకమాండ్‌కు నేను వివరణ ఇచ్చుకున్నాను. విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి నాది తప్పుంటే శిక్షించాలి. రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎవర్నైనా బాధించి ఉంటే క్షమించాలి’ అని ఈ సందర్భంగా కోరారు. ఇదిలా ఉంటే.. ఈ ఆడియో టేపుల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని టేపుల వ్యవహారం ఘటనపై విజిలెన్స్ విచారణ జరిపిస్తోంది. టేపులు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపి పూర్తిస్థాయి విచారణ చేయాలని వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

మరి ఫొరెన్సిక్‌లో ఏమని తేలుతుందో..? నిజమని తేలితే పృథ్వీ పరిస్థితేంటి..? ఒక వేళ అదంతా ఫేక్ అని తెలిస్తే మళ్లీ తీసుకుంటారా..? వేరొకర్ని ఎస్వీబీసీ చైర్మన్‌గా తీసుకుంటారా..? అనేది తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos